హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు మన సాహిత్య, సాంస్కృతిక వెలుగులను పంచాలన్న సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ముంబైలో ‘తెలంగాణ లిటరరీ ఫెస్ట్’ను నిర్వహించనున్నట్టు సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. మహారాష్ట్ర తెలుగు రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలోని కోహినూర్ మంగళ కార్యాలయంలో డాక్టర్ తాటి నరహరి రచించిన ‘34 గోఖలే రోడ్ నార్త్’, సంగెవేని రవీంద్ర రాసిన ‘నిర్బంధ కాలం’ కవితా సంపుటి ఆవిషరణ సభలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
తెలంగాణీయులు అత్యధికంగా ఉన్న ముంబై, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో తెలంగాణ లిటరరీ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహిస్తామని పేరొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఉజ్వల సాహిత్యాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువదించాల్సి ఉన్నదని చెప్పారు. ముంబైలో స్థిరపడ్డ తెలంగాణ కవులు, రచయితలు, కథకులు తెలంగాణ సాహిత్యాన్ని మరాఠీలోకి అనువదించే పనిని భుజంమీద వేసుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి గొప్ప సాహిత్య సృష్టి జరుగుతున్నదని, అది ఇతర భాషల్లోకి అనువదించబడితే మన సాహిత్యానికి విశ్వసాహిత్య గుర్తింపు వస్తుందన్నారు.