హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రాంతాలకు చౌకధరకే ఇంటర్నెట్ సేవలను అందించాలన్న మహోన్నత లక్ష్యంతో గత బీఆర్ఎస్ (BRS) సర్కారు చేపట్టిన ‘టీ-ఫైబర్’ (T-fiber) ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే తొలిసారి చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇతర రాష్ర్టాలకు ఆదర్శనీయమని కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో తెలంగాణ (Telangana) రోల్ మాడల్‌గా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టిన గ్రామాలకు బుధవారం న్యూఢిల్లీలోని యశోభూమిలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025 (ఐఎంసీ-2025)లో జాతీయ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీకి తెలంగాణ వినూత్న విధానాన్ని చేపట్టిందని ప్రశంసించారు. చివరి మైలు ఫైబర్ కనెక్టివిటీ గ్రామీణ సమాజాన్ని ఎలా మార్చగలదో తెలంగాణ చేతల్లో చూపించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును అభినందించారు. ‘టీ-ఫైబర్’ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సహకరించాలని తెలంగాణను ఆహ్వానించారు.
డిజిటల్ సమానత్వం సమ్మిళిత వృద్ధికి పునాది అని, గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, మారుమూల ప్రాంతాల్లోని చిట్టచివరి వ్యక్తికి సైతం డిజిటల్ ఫలాలు చేరాలన్నదే తమ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ‘టీ-ఫైబర్’ ద్వారా తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలతోపాటు ప్రతి ఇంటికీ తకువ ఖర్చుతో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ‘భారత్ నెట్’ అమలులో వేగం పెంచాలని, మన డిజిటల్ ఆస్తులను పరిరక్షించేందుకు సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్లను బలోపేతం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ అంశాల్లో రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి 2017లో ఫైబర్ గ్రిడ్ (టీ-ఫైబర్) ప్రాజెక్టును చేపట్టింది. నాటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దాదాపు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని మారుమూల ప్రాంతాలను ఇంటర్నెట్తో జోడించి ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతోపాటు గ్రామీణ ప్రజలకు టెలీమెడిసిన్, విద్యావకాశాలను అందించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 464 మండలాల్లోని 8,778 గ్రామ పంచాయతీలతోపాటు 10,128 గ్రామాల్లోని 83.58 లక్షల గృహాలకు హైస్పీడ్ నెట్‌వర్క్‌ను అందించడం ద్వారా 3.05 కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలను చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, వ్యాపార సంస్థలకు మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు డిజైన్ చేసిన ‘టీ-ఫైబర్’కు ఐసీటీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఇండియా విభాగంలో నాలెడ్జ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కేసీసీఐ) బిజినెస్ ఎక్స్‌లెన్స్-2022 అవార్డు లభించింది.