హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దేశానికి తెలంగాణ టార్చ్‌బేరర్ అని మరోసారి రుజువైంది. మాతా, శిశు మరణాలు తగ్గించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలోనే తొలిసారిగా అమలుచేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ఈ విధానం ‘విప్లవాత్మకం’ అని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ శుక్రవారం ప్రశంసించింది. ప్రసూతి సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నదని, దిక్సూచిగా మారిందని అభినందించింది. తెలంగాణలో అందిస్తున్న ప్రసూతి సేవలు తల్లుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తున్నాయని, తద్వారా సుఖ ప్రసవాలు జరిగేందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నది. హైదరాబాద్‌లోని ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేస్తూ ‘ఫర్ ఎవ్రీ చైల్డ్.. ఎ హెల్తీ స్టార్ట్’ హాష్‌ట్యాగ్‌తో యునిసెఫ్ ట్వీట్ చేసింది.
దేశంలోనే తొలిసారిగా..
ప్రసూతి మరణాలను తగ్గించేందుకు, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా మిడ్వైఫరీ వ్యవస్థను నాలుగేండ్ల కిందట ప్రారంభించింది. ‘మిడ్వైఫరీ నర్స్ ప్రాక్టీషనర్’ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న నర్సులను ఎంపిక చేసి ఈ శిక్షణ ఇస్తున్నారు. 40 ఏండ్లలోపు వయసున్నవారు దీనికి అర్హులు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాధారణ ప్రసవానికి సిద్ధం చేయడం, వైద్య సేవలు, ప్రసవ సేవలు, ప్రసవానంతరం నవజాత శిశువు రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి సేవలను వీరు అందిస్తారు. వీరిని నిపుణులగా తీర్చిదిద్దేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహాయం తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం వీరికి ఎక్కువ వేతనం ఇస్తారు. అవసరమైన చోట్ల నియమిస్తారు. ఇప్పటివరకు ప్రభుత్వం 212 మందికి శిక్షణ ఇచ్చింది. వారు ప్రస్తుతం 49 దవాఖానల్లో సేవలు అందిస్తున్నారు. మరో 141 మంది శిక్షణ పొందుతున్నారు. వీరి సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
కేంద్రం ప్రశంసలు.. అవార్డులు
మిడ్వైఫరీ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అవార్డులు, ప్రశంసలు లభించాయి. అనేక సందర్భాల్లో కేంద్ర బృందాలతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన బృందాలు రాష్ట్రంలో పర్యటించి, మిడ్వైఫరీ వ్యవస్థను అధ్యయనం చేశాయి. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (నర్సింగ్) డాక్టర్ రతి బాలచంద్రన్ నేతృత్వంలోని కేంద్ర బృందం గజ్వేల్, హైదరాబాద్‌లోని మలక్‌పేట దవాఖానలను సందర్శించింది. మిడ్‌వైఫరీలు గర్భిణులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు సాధారణ ప్రసవాలు చేస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించిన ‘నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్‌షాప్’ మిడ్వైఫరీ వ్యవస్థపై ప్రశంసలు కురిపించింది. దేశంలోనే వినూత్న ప్రయత్నంగా ప్రశంసించి, ప్రత్యేక అవార్డు ప్రకటించింది. మిడ్‌వైఫరీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో మాతృమరణాల రేటు గణనీయంగా తగ్గింది. 2014లో 92గా ఉన్న మాతృమరణాల రేటు ఇప్పుడు 43కు తగ్గిందని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే స్పష్టం చేసింది.
ఆరోగ్య తెలంగాణకు నిదర్శనం: మంత్రి హరీశ్
మిడ్ వైఫరీ వ్యవస్థను యునిసెఫ్ ప్రశంసించడం పట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతున్నదని అనడానికి ఇది మరో నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిడ్వైఫరీలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.