హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బంగారు గని అని రెండు తెలుగు రాష్ర్టాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో ఆయన గురువారం విలేకరులతో బనచర్ల వివాదంపై మాట్లాడారు. ‘మీరు పైన నీళ్లు వాడకపోతే అవి కిందికొస్తాయి. ప్రాజెక్టులు కట్టండి.. నీళ్లు తీసుకోండి’ అని తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు సూచించారు. నీళ్ల కోసం పోరాటం అవసరం లేదన్నారు. కొట్టుకుంటే లాభం లేదన్నారు. సముద్రంలోకి వెళ్తున్న నీళ్లను మాత్రమే తాము వాడుకుంటున్నట్టు పునరుద్ఘాటించారు. గోదావరి నీళ్లను తాము మరో బేసిన్‌కు తీసుకెళ్తుంటే.. తెలంగాణ ఇంకో బేసిన్‌కు తీసుకుళ్తున్నదని చెప్పారు. దీనివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు.
‘తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులను పూర్తిచేసి వాళ్ల నీళ్లు వాళ్లు వాడుకుంటే చాలు’ అని వ్యాఖ్యానించారు. పైన ఉండి నీళ్లు వాడుకుంటే నష్టమా? కింద ఉండి నీళ్లు వాడుకుంటే నష్టమా? అని ప్ర శ్నించారు. తాము సముద్రంలోకి వెళ్లే వృథా జలాలపైనే బనకచర్ల నిర్మిస్తున్నట్టు తెలిపారు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి తెలంగాణ, ఏపీ వాడుకుంటున్నాయని అన్నా రు. తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే తానెప్పడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.