Vanama Venkateswara Rao | కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను కొట్టివేసింది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని ఈ నెల 25న హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా కుటుంబసభ్యుల ఆదాయ వివరాలు వెల్లడించలేదని, ఇది అవినీతి కిందకే వస్తుందని స్పష్టం చేసింది. వనమా చేతిలో ఓటమిపాలైన జలగం వెంకట్రావు 2019లో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను ఆమోదిస్తూ జస్టిస్ జీ రాధారాణి మంగళవారం 84 పేజీల సుదీర్ఘ తీర్పు చెప్పారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు వనమా రానందున ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో వనమా ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించడం చెల్లదని న్యాయమూర్తి పేర్కొంటూ.. వనమాకు బదులుగా పిటిషనర్ వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించారు. ఈ కేసులో పాల్వంచ మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్, చిక్కడపల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ సాక్ష్యాలను హైకోర్టు నమోదు చేసింది.
వనమా తన భార్య పార్వతి పేరిట పాల్వంచలోని 992/2 సర్వే నంబర్లో ఉన్న 8.37 ఎకరాలతోపాటు సంస్థాన్లోని 122/2 సర్వే నంబర్లో ఉన్న 1.33 ఎకరాల ఆస్తి గురించి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని తేల్చింది. ఈ భూములకు ఆయన ప్రభుత్వం నుంచి రైతు బంధు పథకం ద్వారా సాయం పొందినట్టు గుర్తించింది. పాల్వంచలో 300 గజాల్లోని ఇంటి గురించి 2004, 2009, 2014 ఎన్నికల అఫిడవిట్లల్లో పేర్కొన్న వనమా.. 2018 ఎన్నికల అఫిడవిట్లో దాని ప్రస్తావన కూడా చేయలేదని తప్పుపట్టింది. అందుకే వనమా ఎన్నికను రద్దు చేస్తున్నామని వెల్లడించిన హైకోర్టు.. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి పిటిషనర్ జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగుతారని ప్రకటించింది.
అయితే, తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని, అప్పటి వరకు ఇకడి హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు అమలును నిలుపుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో బుధవారం వనమా మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ అందుబాటులోకి రాలేదని, అది వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు. బుధవారం వాదనలు విన్న హైకోర్టు వనమా మధ్యంతర పిటిషన్పై ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. తాజాగా ఈ తీర్పును నిలిపివేసిందుకు నిరాకరిస్తూ వనమా మధ్యంతర పిటిషన్ను కొట్టివేసింది.