హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కామాంధుడైన ఒక వ్యక్తి వల్ల గర్భం దాల్చిన 16 ఏండ్ల బాలికకు గర్భవిచ్ఛిత్తి చేయాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహిం చి గర్భవిచ్ఛిత్తి ప్రక్రియ పూర్తి చేయాలని హైదరాబాద్‌లోని కోఠి ప్రసూతి దవాఖా న వైద్యులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. గర్భంలోని పిండానికి ఉండే హకుల కంటే లైంగికదాడికి గురైన బాలికకు రాజ్యాంగం కల్పించిన హకులే అత్యధిక ప్రాధాన్యం కలిగి ఉంటాయని స్పష్టంచేశారు. దురదృష్టకర పరిస్థితుల్లో ఏర్పడిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వకపోతే బాలిక మానసికంగానే కాకుండా శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గుర వుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫలితంగా ఆ బాలిక శిశువుకు జన్మనిస్తే భవిష్యత్‌లో అనేక సమస్యలతోపాటు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చునని పేర్కొన్నారు. పుట్టబోయే శిశువుతోపాటు తల్లి కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ‘తమ కుమార్తె ప్రాణానికి ముప్పు ఉందని బాలిక తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టబోయే శిశువు జీవితం కంటే బాలిక జీవితం ముఖ్యం. గర్భధారణ అనేది మహిళ ఇష్టం. అవాంఛనీయ గర్భం లేదా లైంగికదాడి వల్ల వచ్చిన గర్భాన్ని చట్టప్రకారం కొన్ని నిబంధనలకు అనుగుణంగా తొలగించొచ్చు. మహిళ హుందాతనం, ఆత్మగౌరవం, ఆరోగ్యంగా జీవించేందుకు రాజ్యాంగం హకులు కల్పించింది. వీటిని పరిగణనలోకి తీసుకొని బాలిక గర్భాన్ని తొలగించాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పుచెప్పారు.
ఆంజనేయులు అనే సమీపబంధువు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. బాలికకు అనారోగ్యంగా ఉంద ని తల్లిదండ్రులు గత నెల 9న కోఠి దవాఖానకు తీసుకువెళ్లినప్పుడు ఆమె 25 వారాల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన గడువు దాటి గర్భం తొలగింపునకు వైద్యులు నిరాకరించడంతో బాలిక తల్లిదండ్రులు హైకోర్టులో రిట్ దాఖలుచేశారు. ముగ్గురు వైద్యుల కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం హైకోర్టు.. సీనియర్ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో 48 గంటల్లో గర్భవిచ్ఛిత్తి చేయాలని తీర్పు వెలువరించింది. డీఎన్ఏ పరీక్ష చేసేందుకు వీలుగా పిండ కణజాలాలను, రక్త నమూనాలను భద్రపర్చాలని కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.