హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): పదిమంది కామాంధులు ఆరు నెలలకుపైగా లైంగికదాడికి పాల్పడటంతో అవాంఛనీయ గర్భం దాల్చిన బాలిక దయనీయ స్థితి హైకోర్టుకు చేరింది. ఆమెకు గర్భ విచ్ఛిత్తికి గాంధీ దవాఖాన వైద్యులు నిరాకరించడంతో బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హై కోర్టు బాలిక గర్భం తొలగింపునకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా బాలిక, ఆమె తల్లి అనుమతి తీసుకుని అబార్షన్ చేయాలని గాంధీ సూపరింటెండెంట్‌కు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అబార్షన్ చేయకపోతే బాలిక శారీరక, మానసిక వేదనకు గురవుతుందని బాధితుల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ కోర్టుకు విన్నవించారు.
20 నెలల గర్భస్థ పిండం తొలగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు స్పెషలిస్ట్ డాక్టర్లతో ఓ మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన గాంధీ యాజమాన్యం సీల్డ్ కవర్లో నివేదిక అందజేసింది. పరిశీలించిన న్యాయమూర్తి, ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని, బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గర్భ విచ్ఛిత్తికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు.