హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతిపై ఎట్టకేలకు సర్కార్ కదిలింది. ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో అవినీతిని వెలికితీస్తూ ‘డీహెచ్‌లో మరో అవినీతి బాగోతం’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు సీనియర్ అసిస్టెంట్‌పై విచారణకు ఆదేశించినట్టు డీహెచ్ రవీందర్‌నాయక్ తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఆయన ‘నమస్తే’ కథనానికి వివరణ ఇచ్చారు. డీహెచ్ విభాగంలో అవినీతి ఆరోపణలపై అంతర్గత విచారణకు ఎంక్వైరీ ఆఫీసర్‌ను నియమిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్టు తేలితే ప్రభుత్వ నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.