Gazette Notification | పురపాలక, వ్యవసాయ విశ్వవిద్యాలయ, మోటారు వాహనాల పన్ను సవరణ చట్టాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతేడాది శాసనసభ, శాసన మండలి పురపాలక సవరణ చట్టం, వ్యవసాయ విశ్వవిద్యాలయం సవరణ చట్టం, మోటారు వాహనాల పన్ను సవరణ చట్టానికి సవరణలు చేస్తూ శాసన సభతో పాటు శాసన మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత బిల్లులను గవర్నర్‌కు పంపగా మూడు బిల్లులకు ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 13వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. పురపాలక చట్టంలో ప్రభుత్వం పలు సవరణలు తీసుకువచ్చింది. మేయర్, చైర్పర్సన్లపై అవిశ్వాసానికి కాలపరిమితిని మూడు నుంచి నాలుగేళ్లకు పెంచుతూ చట్ట సవరణ బిల్లును తెచ్చింది. ఈ బిల్లుకు ఉభయ సభల ఆమోదం తెలిపాయి.
అలాగే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (సవరణ) చట్టం, 1963లోని సెక్షన్ 2, 6, యాక్ట్ నంబర్ 24కు సవరణలు ప్రతిపాదించింది. సవరణతో విశ్వవిద్యాలయం హోమ్ సైన్స్ కోర్స్ పేరును కమ్యూనిటీ సైన్స్‌గా మార్చడంతో పాటు బీఎస్సీ అగ్రకల్చర్, హార్టికల్చర్ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అధికారం యూనివర్సిటీకి ఇస్తూ చట్ట సవరణను తీసుకువచ్చింది.
అలాగే మోటారు వాహనాల పన్ను సవరణలో భాగంగా.. మోటారు వాహనాల జీవిత పన్ను చెల్లింపుల్లో అవకతవకలను అరికట్టేందుకు 1963 ఎంవీ యాక్ట్‌ను ప్రభుత్వం సవరించింది. ఆయా వాహనాలపై జీవితపన్నును తగ్గించుకునేందుకు ఖరీదు ఎక్కువైనప్పటికీ తక్కువ ధరతో ఇన్వాయిస్లను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సవరణ బిల్లును తీసుకువచ్చింది.