చిక్కడపల్లి, ఏప్రిల్ 3: బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో రైతాంగ సాయుధ పోరాటయోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 95వ జయంతి నిర్వహించారు. ఎంపీ లింగయ్యయాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ గణేశ్‌చారి, బీసీ సంఘం నాయకుడు కనకాల శ్యామ్, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు బండి సాయన్న, విమలక్క, దుర్గయ్యగౌడ్, బాడేసాబ్, మాదేశి రాజేందర్, గూడూరి భాస్కర్, ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.