హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా టీజీపీఎస్సీ మాజీ చైర్మన్, ప్రముఖ విద్యావేత్త ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. చాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్టీయూ ఇన్చార్జి వీసీగా తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని నియమించారు. ఇప్పటివరకు ఇన్చార్జి వీసీగా వ్యవహరించిన బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులు కావడంతో ఆయన స్థానంలో బాలకిష్టారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కాగా అంబేద్కర్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన చక్రపాణి మూడేండ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
ఘంటా చక్రపాణి సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. కరీంనగర్ జిల్లా యాస్వాడ గ్రామంలో మొగిలయ్య, జనని దంపతులకు 1964లో జన్మించారు. లోయర్ మానేర్ డ్యాం నిర్మాణంలో వారి గ్రామం ముంపునకు గురికావడంతో వారి కుటుంబం పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్టకు వలసవెళ్లింది. యాస్వాడలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన చక్రపాణి 1990లో ఉస్మానియా విద్యాలయంలో సోషియాలజీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1992లో కమ్యూనికేషన్ జర్నలిజంలో డిప్లొమా చదివారు. సామాజిక శాస్త్రంలో 2001లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఓయూ నుంచి యూజీసీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పొందారు.
ఘంటా చక్రపాణి 1985లో జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1992లో కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ లెక్చరర్‌గా పనిచేశారు. 1994లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్స్, సెంటర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్, డీన్ ఆఫ్ డైరెక్టర్ సహా పలు కీలక హోదాల్లో పనిచేశారు. 2024లో సోషియాలజీ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి టీజీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేశారు.
మేధావిగా, రాజకీయ విశ్లేషకుడిగా, రచయితగా ఘంటా చక్రపాణి ప్రసిద్ధి పొందారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందారు. 2015లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం సహా అనేక అవార్డులు అందుకున్నారు.