హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మోకాలడ్డుతున్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మొత్తం 8 కీలక బిల్లులను తమిళిసై 6 వారాల నుంచి పెండింగ్‌లో పెట్టారు. దీంతో ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో జాప్యం జరుగుతున్నది. విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు కూడా మోక్షం లభించకపోవడంతో నియామకాలు పెండింగ్‌లో పడిపోయాయి. దీనితోపాటు అటవీ విశ్వవిద్యాలయం, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లీజుకు సంబంధించిన బిల్లు, జీఎస్టీ సవరణ తదితర బిల్లులన్నీ పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సెప్టెంబర్ 13నే ఈ 8 కీలక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఆ తర్వాత వీటిని అసెంబ్లీ సచివాలయం గవర్నర్ ఆమోదానికి పంపింది. సాధారణంగా ఉభయసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్ వారంలోగా సంతకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. అనంతరం న్యాయశాఖ గెజిట్లు విడుదల చేయగానే ఆ బిల్లులు అమల్లోకి వస్తాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ.
ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన 8 బిల్లులు గత 42 రోజుల నుంచి రాజ్‌భవన్‌లోనే మూలుగుతున్నాయి. వాటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ తమిళిసై.. రాజ్యాంగ ప్రతినిధిలా కాకుండా బీజేపీ నేతలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. వీటికి మరింత బలాన్ని చేకూర్చేలా ఆమె కీలక బిల్లులను పెండింగ్‌లో పెట్టడం గమనార్హం. ఒక వేళ ఏదైనా ఒకటి, రెండు బిల్లులపై అభ్యంతరాలుంటే వాటిని పెండింగ్‌లో పెట్టి, మిగిలిన బిల్లులను ఆమోదించవచ్చు. కానీ, అన్నింటినీ పెండింగ్‌లో పెట్టడం ఏమిటన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే తమిళిసై ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో గవర్నర్ మాట్లాడుతూ.. తనకూ విస్తృత అధికారాలు ఉన్నాయని, వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనే ఉన్నదని అన్నారు. గవర్నర్‌గా తన పరిధికి లోబడి నడుచుకొంటున్నానని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను పరిశీలించి ‘త్వరలో’ నిర్ణయం తీసుకొంటానని చెప్పిన తమిళిసై.. వాటిని ఎప్పటిలోగా ఆమోదిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు.