TS Minister Koppula | దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎంగా కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని రాష్ట్ర సంక్షేమ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. దివ్యాంగులకు ఆసరా పెన్షన్ రూ.1000 పెంచినందుకు రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పలువురు దివ్యాంగులతో కలిసి సోమవారం అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వాసుదేవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెలా ఇస్తున్న రూ.3016 పెన్షన్ మరో రూ.1000 పెంచి.. శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు ఏ రాష్ట్రంలోనూ ఇంత అద్భుతంగా అమలు కావడం లేదన్నారు. అందరితో సమానంగా దివ్యాంగులు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ఒక్క పెన్షన్ సౌకర్యమే కాకుండా.. విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లోనూ దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌తో పాటు బధిరులకు ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పులకు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విజ్ఞప్తి చేశారు. రోస్టర్-56 వల్ల శారీరక దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ వివరించి రోస్టర్ తగ్గింపు తదితర అంశాలపై సానుకూలంగా స్పందించారన్నారు. దివ్యాంగులను కంటికి రెప్పలా కాపాడుతున్న సీఎం కేసీఆర్ దివ్యాంగుల సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పదేండ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టిన మనసున్న నేత సీఎం కేసీఆర్ అని, దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన గొప్ప నాయకుడన్నారు.