హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు విధించిన మధ్యంతర స్టే ఆదేశాల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడమే లేదు. గతంలో నాలుగు వారాలు గడువు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విచారణ నాటికి బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ దాఖలు చేసినా.. అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 స్ఫూర్తిని దెబ్బతీసేవిధంగా వక్రీకరించారంటూ ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.
రాజ్యాంగ అధికరణాలకు అనుగుణంగానే కౌంటర్ ఉండి తీరాలని, సవరణ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నదో? లేదో? వివరిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేసినా చలనం లేదు. ఈ పిటిషన్ సోమవారం మరోసారి విచారణకు రాగా, ప్రభుత్వం తమ వాదనలతో కూడిన కౌంటర్లు దాఖలు చేయలేదు. పైగా సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు ప్రభుత్వం 2014 నుంచి జారీచేసిన ఎనిమిది ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో స్టే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే దివ్యాంగులకు సాయం అందించేందుకు ఉద్దేశించిన జీవో-4పై ఆంక్షలను ఎత్తివేశారు.
రాజకీయ రంగు ఎందుకు?
విచారణ సందర్భంగా.. ఈ వ్యాజ్యంలో మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్బిన్ అబ్దుల్లా బలాల, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని వారి తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజాధనంతో అమలుచేసే సంక్షేమ పథకాల పంపిణీలో రాజకీయ జోక్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ప్రభుత్వ నిధులను చట్టబద్ధంగా పంపిణీ చేసే బాధ్యత అధికార యంత్రాంగానిదేనని స్పష్టంచేసింది.
ప్రజాధనం నుంచి ఖర్చు చేసే ప్రతి పైసాకు చట్టపరమైన లేదా శాసనపరమైన ఆధారం ఉండాలని స్పష్టంచేసింది. సంక్షేమ పథకాలను అమలు చేయొద్దని తాము చెప్పడం లేదని, వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని పేర్కొన్నది. అనాథలు, మహిళలు, నిరాశ్రయుల వంటి అనేకమంది కనీస గుర్తింపు పత్రాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆధార్/ఓటరు తదితర గుర్తింపు కార్డులు లేకుండా వీధుల్లో ఉంటున్నారని, అటువంటి వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది.

ఎమ్మెల్యేల పాత్ర ఏంది?
ప్రజాధనాన్ని పంపిణీ చేసే అధికారం ఎమ్మెల్యేలకు ఎకడి నుంచి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. చెకులను పంపిణీ చేయడానికి వారికి ఎవరు అధికారం ఇచ్చారు? అందుకు ఏదైనా చట్టం లేదా నిబంధన ఉన్నదా? అని అడిగింది. దీనిపై ఎమ్మెల్యేలు బలాల, మాజిద్ హుస్సేన్ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేల సంతకం ఉండేలా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు ఉన్నదని తెలిపారు. దీంతో ఆ ఉత్తర్వు ఏ చట్టం ఆధారంగా జారీచేశారని ధర్మాసనం నిలదీసింది. ప్రభుత్వ నిధుల వినియోగానికి చట్టబద్ధమైన ఆధారం, శాసనపరమైన అనుమతుల వంటి ప్రక్రియలు ఉంటాయని, ఈ పథకాలకు సంబంధించి అలాంటి చట్టబద్ధమైన ఆధారం ఏమిటో తెలుపాలలని ప్రభుత్వానికి సూచించింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా హైకోర్టు తీవ్రమైన ప్రశ్నలను సంధించింది. ప్రభుత్వం చెల్లించాల్సిన వివిధ బకాయిలను పెండింగ్‌లో ఉంచి సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు ఎలా కేటాయిస్తున్నదని ప్రశ్నించింది. అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భూసేకరణ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై గతంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినా ఎందుకు సమర్పించలేదని నిలదీసింది. ఎనిమిది నెలలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న భూములు కోల్పోయిన బాధితులకు ముందుగా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించింది. దేశ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల పాత్ర కీలకమని గుర్తుచేసింది.
స్టే ఆదేశాల్లో స్వల్ప సవరణ
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను ధర్మాసనం స్వల్పంగా సవరించింది. దివ్యాంగ యువతులకు ఈ పథకాల కింద ఆర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన జీవో-4పై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టపరమైన రక్షణ ఉన్నందున వారికి ఈ పథకాల ప్రయోజనం అందించేందుకు అనుమతించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రా హాజరై, రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేస్తామని చెప్పారు.
స్టే ఎత్తివేయాలంటూ అప్పీల్
పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఏడు ప్రభుత్వ ఉత్తర్వుల అమలుపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. పథకాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదని, ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని అప్పీలులో పేర్కొన్నది. రాజ్యాంగంలోని 162వ అధికరణం కింద ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసే అధికారం రాష్ర్టానికి ఉన్నదని తెలిపింది. పేద కుటుంబాల యువతుల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలిచే ఈ పథకాలపై మధ్యంతర ఆంక్షల కారణంగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండి, వివాహాలు వాయి దా పడే పరిస్థితి ఏర్పడుతున్నదని వివరించింది. ఈ అప్పీల్‌పై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నది.