హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇక్కడ బీఎస్సీ ఫారెస్ట్రీ చదివిన విద్యార్థుల్లో ఏటా ఇద్దరికి ఎమ్సెస్సీ ఫారెస్ట్రీ కోసం పూర్తి ఫండింగ్ ఇచ్చేందుకు అబర్న్ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు అమెరికా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆ యూనివర్సిటీ ఫారెస్ట్రీ కాలేజీ డీన్ డాక్టర్ జానకి అలవలపాటి, తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ఆరేండ్లపాటు అమలులో ఉంటుందని వారు తెలిపారు. అటవీ విద్యలో ఉన్నత చదువు, పరిశోధనలు, మంచి ఉద్యోగాల కల్పనకు ఈ ఒప్పందం దోహద పడుతుందని ప్రియాంక వర్గీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో హరితహారం అమలు, విజయవంతంపై అబర్న్ యూనివర్సిటీ ప్రతినిధులు, విద్యార్థులకు ప్రియాంక వర్గీస్ ప్రత్యేకంగా వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో అబర్న్ యూనివర్సిటీ ప్రతినిధులు విన్నీనాథన్, డాక్టర్ క్రిస్టోఫర్ రాబర్ట్స్, బ్రెట్ వైట్, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.