రాష్ర్టాన్ని కరువుకొదిలి ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తున్నది. సాగునీళ్లు కరువై, అప్రకటిత విద్యుత్తు కోతలతో రైతాంగం అల్లాడుతున్నది. చేతికొచ్చిన పంటలు ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రజలు తాగునీటికీ తల్లడిల్లుతున్నారు. ఈ దశలో రాష్ట్ర రైతాంగం కరువుసాయం కోసం ఎదురుచూస్తున్నది. ఇలాంటి విపతర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ బాటపట్టారు.
- పార్టీ, ప్రభుత్వ నేతలంతా హస్తినకు పయనం
- మూడు రోజులుగా దేశ రాజధానిలోనే మకాం
- సీఈసీ రాజీనామా డిమాండ్‌తో ఆందోళన
- కరువు కోరల్లో రాష్ట్రంలో రైతాంగం విలవిల
- సాయంపై కేంద్రాన్ని కోరని రేవంత్ ప్రభుత్వం
- రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రాథమ్యాలపై తీవ్ర విమర్శలు
- కాంగ్రెస్ ప్రాధాన్యాలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తున్నది. సాగునీళ్లు కరువై, అప్రకటిత విద్యుత్తు కోతలతో రైతాంగం అల్లాడుతున్నది. చేతికొచ్చిన పంటలు ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రజలు తాగునీటికీ తల్లడిల్లుతున్నారు. ఈ దశలో రాష్ట్ర రైతాంగం కరువుసాయం కోసం ఎదురుచూస్తున్నది. ఇలాంటి విపతర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ బాటపట్టారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలి రాజకీయ ధర్నాల కోసం దేశ రాజధానిలో మకాం వేశారు. వందలాది బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను తరలించి 3 రోజులుగా హస్తినలోనే తిష్టవేశారు.
రాష్ట్రం నుంచి సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు, కార్యకర్తలు అట్టహాసంగా ఢిల్లీకి తరలివెళ్లారు. పార్టీ నేతలకు టార్గెట్ పెట్టి మరీ కార్యకర్తలను ఢిల్లీకి తరలించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిర్వహించిన ఆందోళనల్లో వారంతా పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో నిర్వహించిన ఈ రాజకీయ కార్యక్రమానికి చూపిన శ్రద్ధలో కొంతలో కొంతైనా రాష్ట్ర రైతాంగం సమస్యలపై చూపించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తుంటే.. వారి సమస్యలను పరిషరించాల్సిన పాలకులు ఢిల్లీలో ధర్నాలు, రాజకీయ కార్యక్రమాలతో కాలక్షేపం చేయడంపై విస్మయం వ్యక్తమవుతున్నది.
ఢిల్లీకి వెళ్లేందుకు కోట్లల్లో ఖర్చు
రాష్ట్రం కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడుతుంటే సర్కార్ పెద్దలు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు వందలాది బస్సులు, ఇతర వాహనాల్లో ఢిల్లీకి వెళ్లడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనేలా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుమారు 300 ప్రత్యేక బస్సుల ద్వారా 15 వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు సైతం కార్లు, విమానాల్లో హస్తినకు చేరుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ 100 కార్లతో ఢిల్లీకి వెళ్తున్నామంటూ స్వయంగా వెల్లడించారు. ఢిల్లీ ధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి కార్యకర్తలను తరలించేందుకు బస్సులు, కార్లు, విమాన టికెట్లు, రైల్ టికెట్లు, వారి నివాస, భోజన ఖర్చులు ఇలా మొత్తంగా రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారనే అంచనా. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి తొలుత హైదరాబాద్‌లోనే ధర్నాకు నిర్ణయించారు. కానీ ఆ తర్వాత ధర్నా స్థలాన్ని ఢిల్లీకి మార్చి కోట్ల రూపాయలు వృథా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాహుల్‌కు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్
ఓవైపు రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తున్నది. చేతికొచ్చిన పంటలు ఎండుముఖం పట్టి అన్నదాతలు కన్నీరు మున్నీరవుతుండగా ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఇలాంటి విపతర పరిస్థితుల్లో రాష్ర్టాన్ని గాలికి వదిలి కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ఢిల్లీ బాటపట్టారు. రాజకీయ ధర్నా ముసుగులో రాహుల్‌గాంధీకి మద్దతుగా హస్తినలో మూడు రోజుల నుంచి తిష్ఠవేసి విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారు.
అంతన్నరు.. ఇంతన్నరు.. ఆఖరుకు తుస్సుమనిపించారు!
- 15 వేల మందన్నరు.. 2వేల మందీ వెళ్లలే
- నేతలంతా ఫ్లైట్లలో.. పల్లెక్యాడర్ బస్సుల్లో..
- బస్సుల్లో వెళ్లిన శ్రేణులు ఇంకా చేరని వైనం..
ఓట్ చోరీపై ఢిల్లీలో గర్జిస్తామంటూ గడిచిన 15 రోజులుగా హైదరాబాద్‌లో గొంతు చించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు చివరకు తుస్సుమనిపించారు. ‘15 వేల మందితో కదులుతున్నాం’ అంటూ 10 రోజులపాటు గొప్పగా ప్రకటనలు ఇచ్చారు. చివరికి 2,000 మంది కూడా వెళ్లారో? లేదో? అన్న అనుమానం హస్తం పార్టీ నేతల్లోనే ఉన్నది. ఆదివారం ఢిల్లీలో ఓట్ చోరీపై నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం గడిచిన 15 రోజులుగా కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేశారు. రైల్వే అధికారులు తమకు రైళ్లను ఇవ్వడంలేదంటూ రైల్ నిలయం వద్ద ఆందోళనకు దిగారు. రైళ్లు ఇవ్వకపోతే బస్సుల్లో, కార్లలో ఢిల్లీకి వెళ్తామని గొప్పగా ప్రకటించారు. అప్పటికప్పుడు 200కుపైగా ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
వందలాది కార్లలో తరలివెళ్తున్నట్టు జబ్బలు చరుచుకున్నారు. మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు తదితరులతో కలిసి అట్టహాసంగా ఢిల్లీకి తరలివెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి గడిచిన మూడురోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు. కానీ, అంతా కలిపి ఓ వెయ్యి మంది కూడా ఉండకపోవచ్చని సొంత పార్టీ వర్గాలే చెప్పుకొంటున్నాయి. జిల్లాకు రెండు బస్సుల చొప్పున కేటాయించారని, బస్సుల్లో ఢిల్లీ వరకు వెళ్లేందుకు ఎవరూ ఉత్సాహం చూపలేదని తెలుస్తున్నది. వెళ్లిన బస్సులు కూడా ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకోలేకపోయాయని పలువురు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బస్సుల్లో వెళ్లినవారిలో కొంత మంది మధ్యలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించి తీరిగ్గా సాయంత్రానికల్లా ఢిల్లీకి వెళ్లారని తెలుస్తున్నది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌తో ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ నుంచి వచ్చిన వారికి స్వాగతం పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
నేతలంతా విమానాల్లో పయనం
కాంగ్రెస్ నేతలంతా విమానాల్లోనే ఢిల్లీకి చేరుకున్నారు. కార్యకర్తలను మాత్రం ఆ నేతలు బస్సులెక్కించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్మన్లు కూడా ఢిల్లీకి విమానంలోనే వెళ్లారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం హైదరాబాద్‌లో కార్లతో ర్యాలీగా వెళ్తున్నామని చెప్పి బయల్దేరారు. వారు ఢిల్లీ వరకు చేరుకున్నారో లేదో తెలియదు. మొత్తానికి ఢిల్లీలో రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కలిసి సీఎం, పీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు కొద్దిమొత్తంలోనే మెగా ర్యాలీలో పాల్గొన్నారు.
రైతుల గోస పట్టదా?
రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని ప్రభుత్వమే ఇటీవల ప్రకటించింది. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదురొంటున్నది. ఇప్పటికే 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం.. రైతులకు పంట నష్టపరిహారం అందించడంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం ఇస్తారు? ఎప్పటిలోగా అందిస్తారు? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కరువుసాయం కోసం కేంద్రానికి రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీతోపాటు ఇతర సహాయాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ, ఆ సహాయం ఎప్పుడు వస్తుంది? ఎంత వస్తుంది? అనే అంశాలపై రైతులకు స్పష్టత లేదు.
కేంద్రం నుంచి సాయం వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు బాధ్యత తీసుకుంటుందనే దానిపైనా అనిశ్చితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో రైతుల తరఫున కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సిన రాష్ట్ర పాలకులు.. పార్టీ రాజకీయ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోగా రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని విధాలుగా నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా పరిహారం ప్రకటించలేదు. ఆ భారాన్ని కేంద్రంపై నెట్టేసి చేతులు దులిపేసుకున్నది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

