హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, 2వ పీఆర్సీని అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని ఆబ్కారీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం ఉద్యోగులు ఆబ్కారీ భవన్ నుంచి ఇందిరాపార్క్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో తెలంగాణ ఉద్యమం తరువాత ఆబ్కారీ చరిత్రలోనే తొలిసారిగా యూనిఫామ్ సర్వీసెస్ కిందకు వచ్చే సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు సైతం పాల్గొని తమ హక్కుల సాధన కోసం గొంతెత్తారు.
కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ లక్ష్మణ్‌గౌడ్, కార్యదర్శి చంద్రశేఖర్, తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర కృష్ణ, టీఎన్జీవోస్ మీడియా ఇన్చార్జ్ మహేందర్‌రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.