హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ మధ్య జలాల కేటాయింపును పూర్తి చేసేందుకు నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ (కేటీడబ్ల్యూటీ- 2) 2013లో చేసిన కేటాయింపుల ప్రకారం కృష్ణా నదీజలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,005 టీఎంసీల వాటా ఉన్నదన్నారు.
పునర్విభజన చట్టం ప్రకారం ఈ జలాల్లో రెండు తెలుగు రాష్ర్టాలకు దామాషా పద్ధతిన కేటాయించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కానీ ఆ కేటాయింపులను అమలు చేయకపోవడంతో రెండు రాష్ర్టాలు ఇప్పటికీ 712 టీఎంసీలనే పంచుకోవాల్సి వస్తున్నదని, తెలంగాణ తన వాటా జలాలను కోల్పోవాల్సి వస్తున్నదని తెలిపారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టం -1956 ప్రకారం నూతన ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి తెలంగాణకు దక్కాల్సిన వాటాను కేటాయించాల్సింగా విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, కేఆర్ఎంబీకి, కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ మంత్రిత్వశాఖకు లేఖలు రాశారు.