హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత ఇంజినీర్ ఆలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలను ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం, విద్యాసాగర్ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. జలసౌధ ప్రాంగణంలోని ఆలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహానికి ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేందర్రావు, హరిరాం, చీఫ్ ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, తన్నీరు వెంకటేశం, ఎస్ఈలు పూలమాల వేశారు.
ఖైరతాబాద్‌లోని ఇంజినీర్స్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీర్స్ డే ఉత్సవాలను నిర్వహించి, పలువురు ఇంజినీర్లను సత్కరించారు. వాలంతరీ మాజీ డీజీ, నిట్ మాజీ డైరెక్టర్ పీజీ శాస్త్రీ, సాగునీటిశాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ చంద్రమౌళి, రోడ్డు, భవనాలశాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ జస్వంత్‌కుమార్, పంచాయతీరాజ్ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ ఎంఏ కరీంను ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
ఎక్సైజ్‌శాఖపై మంత్రి జూపల్లి సమీక్ష
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం అబ్కారీ భవనంలో సమీక్ష నిర్వహించారు. రాబడి, మద్యం కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు, మద్యం స్టాక్ పై అధికారులతో మాట్లాడినట్టు తెలిసింది. బడ్జెట్లో ఎక్సైజ్‌శాఖ వాటాపై, పన్నుల విధానంపై అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమీక్ష.. మధ్యాహ్నం వరకు కొనసాగింది. అనంతరం సచివాలయంలో నిర్వహించిన మరో సమీక్షకు ఎక్సైజ్ ఉన్నతాధికారులు వెళ్లినట్టు తెలిసింది.
మల్లారెడ్డి కళాశాలకు అటానమస్
మేడ్చల్, జూలై 11 : మేడ్చల్ మున్సిపాలిటీ కిష్టాపూర్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ లభించింది. ఈ మేరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నట్టు గురువారం యూజీసీ ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వేముల మల్లారెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. అటానమస్‌తో కళాశాలపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.
గృహహింసపై 12వేల జంటలకు కౌన్సెలింగ్
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : భరోసా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12,303 జంటలకు, 1,898 కుటుంబాలకు, 16,972 మంది వ్యక్తులకు గృహహింసపై కౌన్సెలింగ్ ఇచ్చినట్టు ఉమెన్ సేఫ్టీవింగ్ గురువారం ఎక్స్ వేదిక ద్వారా తెలిపింది. 2023 నుంచి ఇప్పటి వరకు 10వేల మంది బాధిత మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్టు వెల్లడించింది. గృహహింస చట్టరీత్యా నేరమని, బాధితులు ఎవరైనా షీటీమ్స్ ద్వారా భరోసా సెంటర్లను ఆశ్రయించవచ్చని వెల్లడించింది.
మిగిలిన ఖాళీలకు ప్రమోషన్లు ఇవ్వాలి
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ ప్రమోషన్లలో మిగిలిపోయిన ఖాళీలకు పదోన్నతులు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్)విజ్ఞప్తి చేసింది. గురువారం హైదరాబాద్‌లో ఆ శాఖ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, నాయకులు అశోక్‌కుమార్, ప్రణీద్‌కుమార్ పాల్గొన్నారు.