హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపడుతున్న పోలవరం-బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుపై ఏపీ సర్కారు చర్యలను నిలువరించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అమ్జాద్ హుస్సేన్ మంగళవారం వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ పునర్విభజన చట్టం-2014, ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పీబీ లింక్ ప్రాజెక్టును చేపడుతున్నదని వివరించారు. ఇదేవిషయమై తెలంగాణ ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తం చేయడంతోపాటు కేంద్రానికి సైతం ఫిర్యాదులు చేశారని గుర్తుచేశారు.
పీబీ లింక్ ప్రాజెక్టుకు అనుమతుల మంజూరుకు కేంద్ర పర్యావరణ శాఖ సైతం నిరాకరించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)పై కేంద్ర సంస్థలు, తెలంగాణతోపాటు బేసిన్‌లోని ఇతర రాష్ర్టాలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయని, అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదని వివరించారు. పీబీ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి రూ.9.20 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీచేసిందని పేర్కొన్నారు. టెండర్‌ను అడ్డుకోవాలని, ఏపీ ముందుకు వెళ్లకుండా వెంటనే నిలువరించాలని తెలంగాణ ఈఎన్సీ డిమాండ్ చేశారు.