Telagnana DGP | రాష్ట్రంలో పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఏడాదే కాదు.. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కారణంతో పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. వీటికి పోలీసు శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవని పేర్కొన్నారు. చాలాచోట్ల ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. కొన్ని కేసుల్లో మాత్రమే పని ఒత్తిడి కారణంగా సూసైడ్లు చేసుకుంటున్నారని వివరించారు. 2024 క్రైమ్ వార్షిక నివేదికను హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ జితేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఆత్మహత్య ఆలోచనలు రాకుండా పోలీసులకు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే 9.87 శాతం కేసులు పెరిగాయని డీజీపీ జితేందర్ తెలిపారు. గతేడాది 1,38,312 కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది 1,69,477 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సైబర్ నేరాలు 43.44 శాతం పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది 33,168 సైబర్ క్రైమ్ కేసులను నమోదు చేశామని తెలిపారు. 1525 కిడ్నాప్, 703 దొంగతనాలు, 58 దోపిడీలు, 856 హత్య, 2945 అత్యాచార కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. డయల్ 100కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు
నమోదయ్యాయని పేర్కొన్నారు. 142.95 కోట్ల విలువ చేసే 20 టన్నుల డ్రగ్స్‌ను సీజ్ చేశామని చెప్పారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. 48 డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా సైబర్ నేరగాళ్ల నుంచి రూ.2.42 కోట్ల నగదును రికవరీ చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది 85 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉందని అన్నారు. మేజర్ ఇన్సిడెంట్లు ఏమీ జరగలేదని తెలిపారు.