యువతకు జడిసి హస్తినకు పరార్!
అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నట్టు తెలుస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారనే స్పష్టత ఆ పార్టీకి వచ్చినట్టు చర్చ నడుస్తున్నది.
- ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్
- హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
- నవంబర్ 1న అక్కడ ఆందోళనకు పయనం
- 10 -15 వేల మంది నాయకుల తరలింపు
- సర్పంచ్ల నుంచి మంత్రులందరికీ ఆదేశాలు
- ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సమయంలో ఢిల్లీకా?
- రాష్ట్ర నాయకత్వంపై పార్టీ శ్రేణుల రుసరుసలు
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తేతెలంగాణ) : అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నట్టు తెలుస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారనే స్పష్టత ఆ పార్టీకి వచ్చినట్టు చర్చ నడుస్తున్నది. అందుకే హైదరాబాద్‌లో ఈ నెల 24న నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నదనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.
మొదట హైదరాబాద్‌లో సభ అనుకొని రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు ప్రారంభించిన తరుణంలో హఠాత్తుగా వేదికను ఢిల్లీకి మార్చడంతో క్షేత్రస్థాయి క్యాడర్ గందరగోళానికి గురైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా తెలంగాణ నుంచి దాదాపు 10,000 నుంచి 15,000 మందిని నవంబర్ 1న ఢిల్లీ నిరసనకు తరలించాలని పిలుపునిచ్చారు. ఇంత తకువ సమయంలో అంత మంది కార్యకర్తలు, నేతలను ఢిల్లీకి తరలించడం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద సమస్యగా మారింది.
సర్కార్‌పై యువత గుర్రు
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికార పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే అది ప్రభుత్వానికే రివర్స్ అయ్యే ప్రమాదం ఉన్నదని కాంగ్రెస్ భావించినట్టు తెలుస్తున్నది. అధికారంలో ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే మూడేండ్ల ప్రభుత్వ పనితీరు బయటపడుతుందని పాలక పెద్దలు, పార్టీ నేతలు భావిస్తున్నట్టు చర్చ నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో సీఈసీకి వ్యతిరేకంగా ‘ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ’ నిర్వహించ తలపెట్టిన మహాగర్జన వేదికను ఆకస్మికంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని రామ్ లీలా మైదానానికి మార్చుకున్నది.
ముందుగా ఈ జాతీయ స్థాయి నిరసనను హైదరాబాద్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. ఏఐసీసీ అందుకు అనుమతినిచ్చింది. కానీ అనూహ్యంగా టీపీసీసీ తన నిర్ణయాన్ని మార్చుకున్నది. ఉన్నపళంగా ఢిల్లీలో నిరసనకు తెలంగాణలోని సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా హస్తిన బాట పట్టాలని నిర్ణయించింది. ఈ భారీ తరలింపు బాధ్యతను ఏఐసీసీ నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అప్పగించింది. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ సభ రద్దు వెనుక కారణం?
ముందుగా అనుకున్నట్టుగా హైదరాబాద్‌లో ఈ సభ నిర్వహించకుండా చివరి నిమిషంలో వెనకి తగ్గడం వెనుక బలమైన రాజకీయ, ఆత్మరక్షణ కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో స్వయంగా రాష్ట్ర రాజధానిలోనే జాతీయ స్థాయి నిరసన సభ నిర్వహిస్తే, అది విపక్షాలకు బలమైన రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉన్నదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమైంది.
అధికారంలో ఉండి కూడా హైదరాబాద్‌లో నిరసన సభ పెడుతున్నారంటే ‘మీ ప్రభుత్వంపై మీకే నమ్మకం లేదా?’ అని ప్రతిపక్షాలు ప్రశ్నించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉంటుందని, ఇదే జరిగితే ప్రభుత్వం ప్రజల్లో మరింత పలుచననవుతుందనే ఉద్దేశంతోనే వెనుకడుగు వేసినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో సభ పెడితే జన సమీకరణలో ఏమాత్రం లోటుపాట్లు జరిగినా.. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉన్నదని విపక్షాలు ట్రోల్ చేసినా అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయం టీపీసీసీ, ప్రభుత్వంలో ఏర్పడినట్టు తెలుస్తున్నది. అందుకే సభను నేరుగా ఢిల్లీకి తరలించడమే సురక్షిత మార్గమని భావించి టీపీసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఓటర్ల నమోదు సమయంలో క్యాడర్ ఢిల్లీకి?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మిగతా పార్టీలతో పోలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ ముందే అభ్యర్థులను ప్రకటించింది. ఓటర్ల నమోదు కీలక దశలో ఉన్న సమయంలో క్షేత్రస్థాయి నాయకులంతా ఢిల్లీ బాట పడితే ఎలా అని ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీకి విమానంలో ఇలా వెళ్లి, అలా వస్తారని, రైళ్లలో వెళ్లే క్షేత్రస్థాయి నాయకులు ఢిల్లీ వెళ్లి రావడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుందని, ఈ మూడు రోజులు చాలా కీలకమని అభ్యర్థులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

