హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో సంచల నం సృష్టించిన ‘గోల్డ్ కాయిన్’ కేసులో మరో వ్యక్తిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 2017 నుంచి తప్పించుకు తిరుగుతూ విజయవాడలో తలదాచుకున్న 17వ నిందితుడు (ఏ17) సంగిశెట్టి నాగరవికుమార్ను శనివారం అదుపులోకి తీసుకొని, కోర్టుకు సరెండర్ చేశారు. 2008లో ‘క్వెస్ట్ నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొందరు మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు తెరలేపారు. 33 వేలకే బంగారు నాణెం ఇస్తామంటూ, తొలుత రూ.460 చెల్లించాలని నమ్మబలికి అమాయకుల నుంచి భారీగా డబ్బులు దండుకున్నారు. తర్వాత వారికి నకిలీ నాణేలు ఇచ్చి మోసగించారు. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన నాగరవికుమార్ 2017 నుంచి కోర్టుకు హాజరవ్వట్లేదు. దీంతో అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు ఎస్పీ రాంరెడ్డి నేతృత్వంలోని బృందం విజయవాడలో అదుపులోకి తీసుకున్నది.