హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై ఎలాంటి ప్రకటన లేకుండా.. సీపీఎస్ రద్దు ఊసేలేకుండా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలను ముగించింది. మొదటి దఫా చర్చల్లో అత్యంత కీలకమైన ఈ రెండు డిమాండ్లపై సర్కారు స్పష్టతనివ్వలేదు. చిన్నాచితకా డిమాండ్లను పరిష్కరించేందుకు మాత్రమే తలూపింది. డిమాండ్ల సాధనకు ఉద్యోగుల జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర, చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, డీ శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎస్ రామకృష్ణారావు మంగళవారం జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. మరికొన్ని అంశాలపై వచ్చే సోమవారం సీఎస్ వద్ద చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నేతలు పీఆర్సీ, సీపీఎస్ రద్దు, టీచర్ల ఏకీకృత సర్వీస్‌రూల్స్ వంటి అంశాలను ప్రస్తావించగా సర్కారు దాటవేసింది. పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్‌కు ఇకపై నెలకు రూ.700 కోట్ల చొప్పున మంజూరు చేస్తామని తెలిపింది. మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు, డీపీసీల ఏర్పాటు, ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన వారిని పాత స్థానాలకు పంపించేందుకు ఒప్పుకుంది. హెల్త్‌కార్డుల విధివిధానాల ఖరారుకు ఈనెల 8న సమావేశం నిర్వహించనుంది. ఈహెచ్‌ఎస్‌తో పాటు, మరో 11 అంశాలను పరిశీలిస్తామని సర్కారు తెలిపింది.
తమ సమస్యల పరిష్కారానికి మాటమాత్రం హామీ ఇస్తే ఒప్పుకోబోమని, అన్ని అంశాలపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. తాము ఇచ్చిన డిమాండ్స్ నోటీసులోని వాటిలో వేటిని నెరవేర్చుతారో.. వాటిని లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిందేని పట్టుబట్టారు. దీంతో జేఏసీతో చర్చలు ముగిసిన వెంటనే అరగంటలో లిఖితపూర్వకంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చర్చలు మధ్యాహ్నం 2:20 గంటల ప్రాంతం లో ముగిశాయి. అయితే సాయంత్రం 4:30 గంటల వరకు కూడా ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ రాలేదు. ఎట్టకేలకు సాయంత్రం 5:30గంటల తర్వాత కొన్ని అంశాలపై స్పష్టతనిచ్చారు.
చర్చల సందర్భంగా కొన్ని అంశాలపై స్పష్టతరావడం, సోమవారం మళ్లీ చర్చలుండటంతో ఉద్యోగుల జేఏసీ తమ కార్యాచరణను వాయిదావేసింది. ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహించనున్న బస్సుయాత్ర, అక్టోబర్ 12న తలపెట్టిన చలో హైదరాబాద్‌ను వాయిదావేసినట్టు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. జేఏసీ అదనపు ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, సదానందంగౌడ్, ఏ సత్యనారాయణ, పీ మధుసూదన్‌రెడ్డి, వంగ రవీందర్‌రెడ్డి, బీ శ్యామ్, స్థితప్రజ్ఞ, మణిపాల్‌రెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.