పల్లె, పట్నంలో కేసీఆర్ మార్క్ అభివృద్ధి
సకల రంగాలు సమున్నతం.. సకల జనుల సంక్షేమం.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతి రథం మరింత వేగం అందుకొనే ఇంధనం.. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ స్వరూపం ఇదీ.. నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకొన్న బడ్జెట్ ఇది. సంక్షేమానికి మానవత్వాన్ని జోడించిన సహృదయ బడ్జెట్ ఇది. తెలంగాణ ఆచరించేదానిని.. దేశం ఎందుకు అనుసరిస్తున్నదో చెప్పిన బడ్జెట్ ఇది. దేశ తలసరి ఆదాయం రూ.2 లక్షల దాటడానికే ఆపసోపాలు పడుతున్న సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.3 లక్షలు దాటించిన దార్శనిక పాలనకు నిదర్శనంగా నిలిచిన బడ్జెట్ ఇది. స్వాప్నికుడు, సాధకుడు, దార్శనికుడిగా దేశమే కొనియాడుతున్న సీఎం కేసీఆర్ కలల బడ్జెట్ ఇది. 2,90,396 కోట్ల భారీ బడ్జెట్లో.. అంతే భారీగా 1,59,538 కోట్ల ప్రగతి పద్దును ఆవిష్కరించిన ఆదర్శ బడ్జెట్ ఇది.
పేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. నియోజకవర్గానికి 2,000 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2.63లక్షలమందికి ఈ ఏడాది లబ్ధి చేకూరనున్నది. ఈ సారి బడ్జెట్లో రూ.7,890 కోట్లు కేటాయించారు.
ఉద్యోగుల కోసం కొత్త హెల్త్ స్కీం
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కొత్త ఈహెచ్ఎస్(హెల్త్ స్కీం) విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నది.
స్థానిక సంస్థల ఖాతాల్లోకే నేరుగా నిధులు
స్థానిక సంస్థలను బలోపేతం దిశగా కీలక నిర్ణయం. ఇకపై విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతోపాటు ఫైనాన్స్ కమిషన్ నిధులనూ స్థానిక సంస్థల ఖాతాల్లోకే నేరుగా బదిలీ చేయనున్నది. ఫైనాన్స్, ట్రైజరీల ఆమోదం అవసరం లేదు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం పూర్తి చేయనున్నది. తద్వారా పలు విభాగాల్లోని సుమారు 11 వేల మందికి పైగా ఊరట లభించనున్నది. సెర్ప్ ఉద్యోగుల పేస్కేల్‌ను కూడా సవరణ చేయనున్నది.
అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు 9 జిల్లాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. 4 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ పథకం కోసం 200 కోట్లు కేటాయించారు.
వర్సిటీలకు రికార్డు నిధులు..
విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో రూ. 500 కోట్లను కేటాయించింది. వర్సిటీలకు ఇంతభారీగా నిధులు కేటాయించడం ఇదే తొలిసారి.
కొత్త ఉద్యోగుల వేతనాలకు వెయ్యి కోట్లు
నూతన ఉద్యోగుల జీతభత్యాల కోసం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. ఇప్పటికే 1.41 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం మరో 80,039 పోస్టులను భర్తీ చేస్తున్నది.
ఫార్మా హబ్
ఫార్మా రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. జేఎన్టీయూ సుల్తాన్పూర్ క్యాంపస్‌ను ఫార్మాహబ్‌గా చేయనున్నట్టు ప్రకటించింది.
రైతుబంధుకు పద్దులో రూ.15,075 కోట్లు
దళితబంధుకు రూ.17,700 కోట్ల నిధులు
రైతు బీమాకు రూ.1,589 కోట్ల కేటాయింపు
కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌కు 3,210 కోట్లు
ఆసరా పింఛన్ల కోసం 12వేల కోట్ల నిధులు
ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.10,348 కోట్లు
డబుల్ బెడ్రూం నిర్మాణానికి 12,000 కోట్లు
పల్లె – పట్టణ ప్రగతి రూ.4,834 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ.200 కోట్లు
సీతారామ సహా 3 ప్రాజెక్టులు ఈ ఏడాదిలోనే
అర్చక, ఉద్యోగుల వేతనాలకు రూ.130 కోట్లు
కొత్తగా 100 బస్తీ దవాఖానలకు నిర్ణయం
ప్రతి జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు
సంక్షేమం – అభివృద్ధి
తెలంగాణ తలసరి ఆదాయం : 3,17,171 /-
దేశ తలసరి ఆదాయం : 1,97,000 /-
అంకెలు రూ.కోట్లలో
నిర్వహణ పద్దు : 1,30,858
ప్రగతి పద్దు : 1,59,538
రెవెన్యూ వ్యయం : 2,11,685
మూలధన వ్యయం : 37,525
పన్ను ఆదాయం! : 1,31,000
ఎస్సీ ప్రత్యేక నిధి : 36,750
ఎస్టీల ప్రగతి పద్దు : 15,233
పారిశ్రామికవృద్ధి : 4,037 కోట్లు
విద్యా రంగానికి : 19,093 కోట్లు
సంక్షేమ రంగాలకు : 35,547 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు : 32,019 కోట్లు
వైద్య ఆరోగ్యం : 12,161 కోట్లు