Budget 2025 | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ) : ‘తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26’ కూర్పుపై ప్రభుత్వం అపసోపాలు పడుతున్నది. గడువు సమీపిస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రాధాన్యత రంగాలను గుర్తించలేకపోతున్నది. దీంతో ఏ శాఖకు కేటాయింపులు పెంచాలి? ఏశాఖ కేటాయింపుల్లో కోత పెట్టాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వరుసగా ఉన్నత స్థాయి సమీక్షలు చేస్తున్నారు. బుధవారం ఆర్థికశాఖపై సీఎం సమీక్ష జరపగా, గురువారం భట్టి విక్రమార్క ఆర్అండ్బీ, బీసీ సంక్షేమ శాఖ, రవాణాశాఖల ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఆయాశాఖలకు సంబంధించి చేపట్టాల్సిన పనులు, అందుకు అయ్యే నిధులపై చర్చించారు.
అయినా ఇప్పటివరకు బడ్జె ట్ కూర్పుపై ప్రభుత్వం తుది అంచనాలకు రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నా యి. గతంలో ఇరిగేషన్, విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా ఏటా ఒకటి రెండు ప్రాధాన్య త అంశాలను ప్రభుత్వం ఎంచుకుని.. ఆయా శాఖలకు నిధులు ఎక్కువగా కేటాయించి, మిగతా శాఖలకు సర్దుబాటు చేసేది. నిరుడు ప్రభుత్వం రూ.2,91,149 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. అందులో సంక్షేమానికే ఎక్కువ నిధులు కేటాయించి, మూలధన వ్యయం కింద కేటాయింపులు తగ్గించింది. దీంతో ఏ రంగానికీ ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది.
కొన్నేండ్లుగా బడ్జెట్‌ను ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టే ఆనవాయితీ కొనసాగుతున్నది. అయి తే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం ఒక అంచనాకు రాలేదని తెలుస్తున్నది. అధికారులు ప్రాథమిక బడ్జెట్ ముసాయిదాను పూర్తి చేశారని, తుది సమీక్షల కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. దీంతో ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే అవకాశం లేదని స్పష్టమవుతున్నది. మార్చి రెండోవారంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
బడ్జెట్‌పై రెండుమూడు నెలల ముందు నుంచి సన్నాహాలు జరపాల్సి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. కనీసం డిసెంబర్ రెండోవారం నుంచి ప్రారంభిస్తే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే అవకాశం ఉండేదని చెబుతున్నారు. కానీ సంక్రాంతి దాటేవరకు బడ్జెట్ కూర్పుపై పెద్దగా సన్నాహక సమావేశాలు జరపలేదని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఒకటిరెండు సమీక్షలకే పరిమితం కాగా, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార సైతం అన్ని శాఖల సంప్రదింపులు పూర్తి చేయలేదని.. దీంతో ఆలస్యం అయ్యిందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.