శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 00:36:29

తక్కువ అంచనాలు.. ఎక్కువ ఫలితాలు

తక్కువ అంచనాలు.. ఎక్కువ ఫలితాలు
  • పక్కా లెక్కలతో పకడ్బందీ బడ్జెట్‌
  • ఆర్థికమాంద్యం, కేంద్ర విధానాలతో అంచనాల్లో సవరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:పైసా పైసాను లెక్కించి.. ఆదాయ, వ్యయాలను కచ్చితంగా అంచనావేసి ప్రభుత్వం పూర్తి వాస్తవిక దృక్పథంతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నది. 2020-21వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షికబడ్జెట్‌కు తుదిమెరుగులు దిద్దే ప్రక్రియను పూర్తిచేసింది. ఎక్కడా భారీ అంచనాలకు వెళ్లకుండామార్కెట్‌లో ఒడిదుడుకులను, ఆర్థికమాంద్యాన్ని పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలుస్తున్నది. ‘తక్కువ అంచనాలు.. ఎక్కువ ఫలితాలు’ అన్నసూత్రంతో సీఎం కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో బడ్జెట్‌కు పూర్తిరూపమిచ్చారు. ఈసారి కూడా సంక్షేమరంగానికి, నీటిపారుదల, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. గత సెప్టెంబర్‌లో ఆరునెలల కాలానికి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌ తరహాలోనే ఈసారికూడా వాస్తవ లెక్కలకు అద్దం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూ.1,46,492.30 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రగతి పద్దు రూ. 75,283.24కోట్లు కాగా.. నిర్వహణ పద్దు రూ.71,229.06 కోట్లుగా ఉన్నది. ఈసారి కూడా కొంత అటుఇటుగా బడ్జెట్‌ ఉంటుందని అంటున్నారు. ఆర్థికమాంద్యంతోపాటు కేంద్రంలో చోటుచేసుకున్న ఆర్థికపరిణామాలు రాష్ట్ర బడ్జెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. 


కేంద్రం ఈసారి రాష్ర్టాల పన్నుల వాటాను 41 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు కేంద్ర పన్నుల్లో రాష్ర్టానికి 2.48 శాతం నిధులు వస్తున్నాయి. తాజా నిర్ణయం వల్ల రాష్ర్టానికి వచ్చే పన్నుల వాటా 2.13కు తగ్గింది. పన్నులవాటాలో తేడాతోపాటు ఈసారి పన్నుల రాబడి బాగా తగ్గుతున్నందున కేంద్రం నుంచి రావాల్సిన మొత్తంలో గండిపడుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో  కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ. 20వేల కోట్లు వస్తాయని అంచనా వేయగా.. కేంద్రప్రభుత్వ వైఖరితో రూ. 16 వేల కోట్లకే పరిమితమవుతున్నది. గతేడాది రూ.18,500 కోట్ల వరకు పన్నుల వాటా రాగా.. ఈసారి అంచనా కంటే దాదాపు రూ. 4వేల కోట్లు గండిపడటం వల్ల బడ్జెట్‌ అంచనాలను కుదించుకోవాల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వ వైఖరి వల్ల దాదాపు 18 శాతం నిధులకు కోత పడింది.


ప్రతికూల పరిస్థితులను ముందే పసిగట్టి..

ఇక సొంత రాబడులు స్థిరంగా ఉన్నా అంచనాలకు అనుగుణంగా వృద్ధిరేటు నమోదు కాలేదు. ప్రతీ ఏడాది కనీసం 15 నుంచి 17 శాతంగా ఉన్న వృద్ధిరేటు ఈసారి మొత్తంగా 5 నుంచి 6 శాతం లోపుగానే ఉన్నది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఆర్థికమాంద్యాన్ని, మార్కెట్‌ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని గట్టిగా నిలబడిన రాష్ట్రంగా తెలంగాణ ముందువరుసలో ఉన్నది. కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయాలు దేశవ్యాప్తంగా శాఖలవారీగా నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినట్టు తెలుస్తున్నది. ఆర్థికమాంద్యం, జాతీయస్థాయిలో ప్రతికూల పరిణామాలను ముందే పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఉన్నతాధికారులను నాలుగు నెలల కిందటే అప్రమత్తం చేశారు. అన్నిరంగాల్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచి.. సంక్షేమం, అభివృద్ధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్దిష్టంగా ఆదేశాలు జారీచేశారు. ఇందుకు అనుగుణంగానేబడ్జెట్‌ రూపకల్పన జరిగింది.


logo