హైదరాబాద్, జూన్ 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూయిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కొత్త నాటకానికి తెరతీసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలంగాణ బిడ్డలు ఘాటుగా బదులిచ్చారు. పవన్ చేసిన కీలక వ్యాఖ్యలకు అంతే సూటిగా జవాబిస్తూ జనసేనాని కుట్రపూరిత ఆలోచనలను ఎక్కడికక్కడ పూడ్చిపెట్టారు.
పవన్ మాట: తెలంగాణ విభజనకు కాదు.. విభజన జరిగిన తీరుకు మేం వ్యతిరేకం!
తెలంగాణ బిడ్డ తూటా: విభజన ప్రక్రియ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రక్రియకు వ్యతిరేకం అంటే తెలంగాణను వ్యతిరేకించినట్టే కదా!
పవన్ మాట: తెలంగాణ నీ అయ్య జాగీరా?!
తెలంగాణ బిడ్డ తూటా: కచ్చితంగా మా అయ్య జాగీరే! కాకపోతే, నీ అబ్బ జాగీరా?!
పవన్ మాట: టీటీడీ నుంచి కొండగట్టు ఆంజనేయుడికి రూ.30 కోట్లు ఇప్పించా!
తెలంగాణ బిడ్డ తూటా: అది నీ సొంత సొమ్ము కాదు. ఇచ్చింది తిరుమల దేవస్థానం. తిరుమల హుండీలో (టీటీడీ) తెలంగాణ బిడ్డల భాగస్వామ్యం లేదా?!
పవన్ మాట: అడగ్గానే, గద్దర్‌కు రెండ్రోజుల్లో కారు కొని ఇచ్చా!
తెలంగాణ బిడ్డ తూటా: గద్దర్‌కు కారు కొనిస్తే, దాంతో తెలంగాణ సమాజానికి ఏం సంబంధం?!
పవన్ మాట: తెలంగాణ అంటే పాకిస్థానా? పాలస్తీనానా?
తెలంగాణ బిడ్డ తూటా: తెలంగాణను పాకిస్థాన్‌తో, పాలస్తీనాతో పోలుస్తున్నావ్ అంటేనే, తెలంగాణపై నీకు ఎంత ప్రేమ, గౌరవం ఉన్నదో తెలిసిపోతున్నది.
పవన్ మాట: తెలంగాణ వాళ్లను నేనెప్పుడైనా తిట్టానా?
తెలంగాణ బిడ్డ తూటా: కోనసీమలో కొబ్బరి చెట్లు నేలకొరిగితే, తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది అన్నదెవ్వరూ? నోరు తెరిస్తే, తాటతీస్తా అనేది తిట్టు కాదా!
పవన్ మాట: తెలంగాణ-ఏపీని కలిపే రహదారికి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టి ఆయన విగ్రహం ఉంచాలి.
తెలంగాణ బిడ్డ తూటా: తెలంగాణను ఆంధ్రాతో కలుపడానికి అంగీకరించిన బూర్గుల పేరే ఎందుకు? తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పిన కేసీఆర్ పేరు, విగ్రహాలు ఎందుకు పెట్టొద్దు.
పవన్ మాట: భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే!
తెలంగాణ బిడ్డ తూటా: ఏపీ కూడా భారత్‌లో అంతర్భాగమే కదా.. అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెడ్తవా?
పవన్ మాట: ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం.
తెలంగాణ బిడ్డ తూటా: భారత్ అంటేనే అనేక ప్రాంతాలు, జాతుల సమాహారం. ప్రాంతీయత లేకుండా జాతీయత ఎక్కడిది? వేర్పాటు వాదం ప్రమాదకరం. ప్రాంతీయవాదం కానేకాదు. ఇది కూడా తెలియని నువ్వు డిప్యూటీ సీఎం ఎలా అయ్యావ్?
పవన్ మాట: తెలంగాణకు రావాలంటే పాస్‌పోర్ట్ కావాలా?
తెలంగాణ బిడ్డ తూట: ఇప్పుడు పాస్‌పోర్ట్ ఉంటేనే, తెలంగాణకు వచ్చావా?!
పవన్ మాట: చెరువు కబ్జాగా నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిస్తా.
తెలంగాణ బిడ్డ తూటా: ప్రభుత్వం నిరూపించినంక నువ్ రాసివ్వాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వమే లాగేసుకుంటది.
పవన్ మాట: తెలంగాణ నాయకులను ఏనాడూ తిట్టలే..
తెలంగాణ బిడ్డ తూటా: సత్యహరిశ్చంద్రా.. తాట తీస్తా అన్నది నువ్ కాదా?