Paravasthu Lokeshwar | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : 1975 జూన్ 25న దేశం ప్రజాస్వామ్యంలో నిద్రపోయి నిరంకుశ, నియంతృత్వంలో నిద్రలేచిందని ప్రముఖ రచయిత పరవస్తు లోకేశ్వర్ పేర్కొన్నారు. తనకు ఎదురేలేదని విర్రవీగిన ఇందిరాగాంధీ పార్లమెంట్ వ్యవస్థను ఎత్తేసి అధ్యక్ష తరహా విధానాన్ని దేశానికి పరిచయం చేయాలని కలలుగని ప్రజాగ్రహానికి గురయ్యారని చెప్పారు. చరిత్ర నుంచి పాఠాలను గుణపాఠాలుగా స్వీకరించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చి నిరాశ్రయులను చేసిన కాలం ఎమర్జెన్సీదని గుర్తు చేసుకున్నారు. అయితే, అది ఢిల్లీలో జరిగిన సంఘటన అని చెప్పారు. ఎమర్జెన్సీ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి కాంగ్రెస్ సీఎం జలగం వెంగళరావు చేసిన అణచివేతను ఆయన కండ్లకు కట్టారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని అమలు చేసి నేటికి 50 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఆ కాలంలో యువకుడిగా ఉన్న వ్యక్తి పరవస్తు లోకేశ్వర్ నాటి దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులను ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
నమస్తే తెలంగాణ : నేటితో ఎమర్జెన్సీకి యాభై ఏండ్లు. మీకు దాదాపు 74 ఏండ్లు. మీరు యువకుడిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులను వివరిస్తారా?
లోకేశ్వర్ : ఎమర్జెన్సీ నాటికి నాకు 24 ఏండ్లు. ఆ కాలంలోని ప్రజలు ఎటువంటి ప్రభావాలకు లోనయ్యారో నేనూ వాటికి గురయ్యాను. నేనేమీ అతీతుడిని కాదు కదా.
నమస్తే తెలంగాణ : రచయితగా, చరిత్రకారుడిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించేందుకు గల నేపథ్యాన్ని, అనంతర పరిణామాలను వివరిస్తారా?
లోకేశ్వర్ : 1970ల్లో ‘గరీబీ హఠావో’ నినాదంతో ఇందిరాగాంధీ ఎన్నికలకు పోవడంతో పార్లమెంట్లో ఆమెకు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఆమెకు అని ఎందుకు అంటున్నానంటే పార్టీ ఆమెదిగా చలామణి అయింది. అయితే, అప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ధరలు విపరీతంగా పెరిగాయి. ఆ సమయంలో గుజరాత్లో హాస్టల్ బిల్లులు డబుల్ కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారుల అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. అలాగే బీహార్‌లోనూ దాదాపు అవే కారణాలతో విద్యార్థులు సమ్మెచేశారు. ఆ రెండు రాష్ర్టాల్లో జరుగుతున్న సమ్మెలకు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) మద్దతు ఇచ్చారు. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా రెండు రాష్ర్టాల్లో విస్తృతంగా పర్యటించారు. సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చారు. జేపీ పిలుపుతో పోరాటాలు తీవ్రరూపం దాల్చాయి.
అదే సమయంలో దేశవ్యాప్తంగా 18 లక్షల మంది రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగారు. జార్జ్ ఫెర్నాండెజ్, డాంగే, మధులిమాయే వంటి ట్రేడ్ యూనియన్ నాయకులు మద్దతు పలికారు. రైల్వే ఉద్యోగులు, కార్మికుల సమ్మెతో దేశ రవాణా సౌకర్యాలు ఆగిపోయి ఆర్థిక వ్యవ్యస్థ స్తంభించిపోయింది. ఇవి కొనసాగుతుండగా అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. వచ్చే ఆరేండ్ల వరకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికల్లోనూ ఆమె పోటీచేయడానికి వీల్లేదని ఆదేశించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ కూడా దాదాపు అదే నిర్ణయం వచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌లోని సీనియర్లు ‘ఇక తామే పీఎం’ అని సంతకాల సేకరణలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇందిరాగాంధీకి చేరవేశాయి. పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తదని భావించిన ఇందిరాగాంధీ ఏకపక్షంగా, క్యాబినెట్ సమావేశం లేకుండా 1975 జూన్ 25న రాత్రి అప్పటి రాష్ట్రపతి (ఫక్రుద్దీన్ అలీ అహ్మద్) భవన్‌కు వెళ్లి ఎమర్జెన్సీపై సంతకం చేయించారు. అలా దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది.
నమస్తే తెలంగాణ : కేంద్ర క్యాబినెట్ సమావేశం కాకుండా అంతపెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు?
లోకేశ్వర్: వాస్తవానికి క్యాబినెట్ తీర్మానం లేకుండా రాష్ట్రపతి సంతకం చేయడం రాజ్యాంగ విరుద్ధం. కానీ, ఇందిరాగాంధీ అడ్డూ అదుపులేనితనం, పదవి పోతుందనే భయంతో అలా జరిగిపోయింది. 1975 జూన్ 25న రాత్రి దేశం ప్రజాస్వామ్యంలో నిద్రపోయి జూన్ 26వ తేదీన నిరంకుశ నియంతృత్వ వ్యవస్థలో నిద్రలేచింది. దేశమంతా షాక్‌కు గురైంది. తెల్లారి ఉదయం తన మంత్రివర్గాన్ని పిలిపించి రాష్ట్రపతి సంతకం చేసిండు కనుక మీరు కూడా సంతకాలు చేయండి అని ఇందిరాగాంధీ బెదిరించారు. మంత్రులందరూ భయపడి నోరు మెదపకుండా సంతకాలు పెట్టారు.
నమస్తే తెలంగాణ: ఎమర్జెన్సీ పర్యవసానాలను వివరిస్తారా?
లోకేశ్వర్ : ఇక్కడ మీకో విషయం చెప్పాలి. రాష్ట్రపతితో సంతకం చేయించిన మరుక్షణం నుంచే లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, వాజ్‌పేయి, మధులిమాయే సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ ఇందిరాగాంధీ రాత్రికి రాత్రే జైళ్లల్లో పెట్టించారు. పౌరహక్కులన్నీ నిషేధానికి గురయ్యాయి.
నమస్తే తెలంగాణ : అంటే జీవించే హక్కు కూడా ప్రమాదంలోకి వెళ్లిపోయిందని భావించాలా?
లోకేశ్వర్: ఎమర్జెన్సీ కాలంలో బతికి ఉన్నా ప్రయోజనం ఏమిటి? దానికి ప్రమాదం అన్నట్టే కదా! రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ కూడా పత్రికలకు సెన్సార్షిప్ విధించడంతో పోయింది. అంటే పత్రికలు వస్తాయి కానీ, ఎమర్జెన్సీ వార్తలేవీ రాయకూడదు. ఒక్క ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మినహా పత్రికలన్నీ ఇందిరాగాంధీకి దాసోహమయ్యాయి. బీడీ గోయెంకా గ్రూప్ మీడియా (ఇండియన్ ఎక్స్‌ప్రెస్, తెలుగులో ఆంధ్రప్రభ) మాత్రం ఇందిరాగాంధీకి దాసోహం కాలేదు. అప్పుడా పత్రిక ఎడిటర్ కులదీప్ నయ్యర్. వాస్తవాలు రాసినందుకు న్యూస్ ప్రింట్ ఆపేయడం, పత్రికలకు కరెంట్ సరఫరా నిలిపివేయడం, ఆఖరికి నీటి సరఫరా కూడా ఆపేసిన కాలమది.
ఎమర్జెన్సీ వార్తలను రాసిన ఆ పత్రిక ఎడిటర్ కులదీప్ నయ్యర్‌ను అరెస్టు చేశారు. ఒక సందర్భంలో ఇందిరాగాంధీ మీడియా సమావేశం పెట్టి ‘ఇప్పుడు ఏ కుక్కా మొరగడం లేదు’ అని క్రూరంగా వ్యాఖ్యానించారు. ఆ టైంలోనే ‘రాత్రి పూట ఎమర్జెన్సీకి భయపడి కుక్కలు కూడా మొరగడం లేదు’ అని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రీడమ్ ఆఫ్ ప్రెస్‌ను తీవ్రంగా అవమానించిన కాలం. అందుకే ఎమర్జెన్సీ కాలాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు అన్నరు. ఆ టైంల జైళ్లల్లో ఉన్నవాళ్లు ఇక తాము జన్మలో విడుదల కామేమో, తమ చితాభస్మం మాత్రమే ఇండ్లకు చేరుతుందేమో అనుకున్నరు. ఎమర్జెన్సీ టైంలో నెలకొన్న నిర్బంధానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమికావాలి?
నమస్తే తెలంగాణ: ఉత్తరభారతదేశంలో నెలకొన్న తీవ్రమైన అణచివేతను దక్షిణభారతదేశం ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్నదనుకోవాలా?
లోకేశ్వర్: అతీతంగా ఉంటాయని ఎందుకు అనుకుంటారు. అంతకన్నా తీవ్రంగానే ఇక్కడి పరిస్థితులున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన జలగం వెంగళరావు ఏపీ ముఖ్యమంత్రి. ఎమర్జెన్సీని అడ్టంపెట్టుకొని అనేక మందిని ఎన్కౌంటర్ చేయించారు. గిరాయిపల్లి ఎన్కౌంటర్. ఇది దేశంలో జరిగిన తొలి ఎన్కౌంటర్. అలాగే దేశంలో మొట్టమొదటిసారిగా కిష్ణాగౌడ్, భూమాగౌడ్ అనే ఇద్దరు రాజకీయ ఖైదీలను ఉరితీశారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని జైళ్లల్లో ఖైదీలు నిరాహార దీక్షలు చేసిండ్రు. అనేక ఎన్కౌంటర్లు జరిగాయి. వేలాది మందిని అరెస్టు చేశారు. బుల్డోజర్లతో కూల్చివేతలు దేశం చూసింది అప్పుడే.
నమస్తే తెలంగాణ : అంటే కాంగ్రెస్ ఇప్పుడే కాదు అప్పుడే పేదల మీదికి బుల్డోజర్లను పంపిందన్నట్టా?
లోకేశ్వర్: కాంగ్రెస్ బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చింది. అప్పుడు ఢిల్లీలో టర్క్మన్గేట్ అనే మురికివాడలో వేలమంది నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవాళ్లు. ఇందిరాగాంధీ కొడుకు సంజయ్‌గాంధీ టర్క్మన్గేట్ ప్రాంతంలోని పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొట్టించిండు. లాఠీచార్జి చేయించి పిల్లా పెద్ద అని చూడకుండా ఆఖరికి ఆడవాళ్ల మీద చేయిచేసుకున్న దారుణాలు జరిగాయి. సామాన్య ప్రజలకు ప్రాథమిక హక్కులు అంటే అర్థంకాదు కానీ, వారి జీవితాలు నాశనమయ్యాయి. ఇక కుటుంబ నియంత్రణ ఏ స్థాయిలో చేశారో చెప్పకూడదు.
పెండ్లికాని యువకులకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించిన దుర్మార్గమైన కాలం ఎమర్జెన్సీది. అయితే, ఇంటెలిజెన్స్ ఇందిరాగాంధీకి ఒక తప్పుడు సమాచారం ఇచ్చింది. అదేమంటే ‘మీరు ఎన్నికలు పెడితే మళ్లీ సంపూర్ణ మద్దతు మీకే’ అని సమాచారం ఇచ్చింది. దీంతో ‘ఒక్కసారి గెలిస్తే పది పదిహేనేండ్ల దాకా ఎన్నికలే పెట్టకూడదని, పార్లమెంటరీ విధానాన్ని ఎత్తేసి అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలని ఇందిర ఆలోచించారు. అట్లా చేస్తే తనకు ఎదురే ఉండదని భావించారు. అయితే, అప్పుడు ఆ టైంలో ఎన్నికలే పెట్టొద్దనేది సంజయ్‌గాంధీ అభిప్రాయం. మొత్తానికి ఎన్నికలు పెడితే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. తల్లీకొడుకులు సైతం ఓడిపోయారు.
నమస్తే తెలంగాణ: ఎమర్జెన్సీ నుంచి కాంగ్రెస్ ఏమైనా నేర్చుకున్నదా? ఇప్పుడెటువంటి పరిస్థితులున్నాయి?
లోకేశ్వర్: ఎమర్జెన్సీ నుంచి అనేక గుణపాఠాలు నేర్చుకున్నది. అయితే, ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతున్నది. ఎమర్జెన్సీ విషయంలో కాంగ్రెస్ టోటల్‌గా తప్పు చేసింది. అనేక రకాలుగా రాజ్యాంగం ఉల్లంఘించబడుతున్నది. భావప్రకటనా స్వాతంత్య్రం లేదు. ఇంకోసారి నియంతృత్వంవైపు వెళ్లే ప్రమాదం కనబడుతున్నది. మనం జాగ్రత్తగా ఉండాలె. గత పదేండ్లలో దేశమంతా అప్రకటిత ఎమర్జెన్సీని అనుభవిస్తున్నది. మళ్లీ ఒక నియంతృత్వం వైపు పోయే ప్రమాదం కనబడుతున్నది. ఎమర్జెన్సీ కాలంలో నెలకొన్న సంగతులు ఈ తరానికి తెలవాలి. తెలిసి మళ్లీ అటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ఎమర్జెన్సీ హెచ్చరిస్తున్నది. చరిత్ర నుంచి నేర్చుకున్న పాఠాలను గుణపాఠంగా తీసుకోవాలి.