హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): నిన్న.. అస్తిత్వ ఆరాటంలో, దోపిడీపై పోరాటంలో తొడగొట్టి నిలిచింది తెలంగాణ.. అరిగోసలు గడిచింది తెలంగాణ.. గుండె నెత్తురులు తర్పణ చేస్తూ త్యాగాల బాటలో నడిచింది తెలంగాణ.. అగ్నిపరీక్షలు ఎదుర్కొన్న నిరుపమాన దీక్ష తెలంగాణ.. అసమాన స్వేచ్ఛా కాంక్ష తెలంగాణ.. జనం గుండె చప్పుడును పాటగా మలచి దిక్కుల్ని ఊగించింది.. హక్కుల్ని సాధించింది.. నవభారత యవనికపై జయగీతికలాలపించింది తెలంగాణ..
నేడు..చీకట్లను పారదోలే కోటి విద్యుల్లతలు ఎగబాకిన తరువై వెలుగులీనుతున్నది తెలంగాణ.. జీవన గంగాసరితను పాతాళం నుంచి ఆకాశపు బాటపట్టించిన అపర భగీరథం తెలంగాణ.. సకల జనుల హితమే అభిమతంగా కదం తొక్కుతూ ముందుకు సాగుతున్న అజేయ మనోరథం తెలంగాణ.. సామాన్యులు మాన్యులై ఊరేగుతున్న స్వర్ణరథం తెలంగాణ.. నివురు లోంచి నింగికెగసిన ఫీనిక్స్ పక్షి తెలంగాణ..దేశానికి దారిచూపే దీపం తెలంగాణ.. అభివృద్ధికి నిండైన రూపం తెలంగాణ..