జయశంకర్ భూపాలపల్లి, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : పోరాటాల పురిటి గడ్డ వెలిశాల ఎరుపెక్కింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ మృతదేహం శుక్రవారం ఉదయం వెలిశాలకు చేరుకోగానే చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చర్చల ప్రతినిధి అమర్, అరుణోదయ కళాకారుల సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, విప్లవ సంఘం నేతలు గాదె ఇన్నయ్య, చెరుకు సుధాకర్ తదితరులు గణేశ్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
ప్రజా సంఘాలు, పౌరహక్కుల నేతలు, రాజకీయ నేతలు, విప్లవ కవులు, కళాకారులు గణేశ్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గణేశ్ అంతిమయాత్రకు ఛత్తీస్గఢ్, ఒడిశాకు చెందిన మాజీ నక్సలైట్లు, గణేశ్ అభిమానులు, ఉమ్మడి వరంగల్ సహా ఇతర జిల్లాల నుంచి మాజీలు, ప్రజలు హాజరయ్యారు.