Gurukula Transfers | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): గురుకుల సిబ్బంది బదిలీలకు షెడ్యూల్‌ను ప్రకటించి, తీరా వారు వచ్చాక కౌన్సెలింగ్‌ను వాయిదా వేశామని చెప్పడంతో సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ పరిధిలోని ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్లు ఏకాదశి పండుగపూట హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారాభవన్ ఎదుట పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో సొసైటీ ఉన్నతాధికారుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
317 జీవో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6, 7న నిర్వహించిన కార్యక్రమానికి సొసైటీ పరిధిలోని ఇతర క్యాడర్ల సిబ్బందితోపాటు ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్లు హాజరై తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం 317 జీవో డిస్లొకేట్ అభ్యర్థులకు 10న బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు.ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, వ్యాయామ టీచర్లకు మధ్యాహ్నం 12 గంటలకు సమయం కేటాయించారు. దీంతో ఉదయం నుంచి పడిగాపులు గాచిన వారికి ఆ రోజు రాత్రి 7.30 గంటలు దాటినా కౌన్సెలింగ్ నిర్వహించలేదు.
తుదకు 13న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పి పంపారు. ఆ రోజున సిబ్బంది మొత్తం వచ్చినా కౌన్సెలింగ్‌ను మళ్లీ వాయిదా వేస్తున్నట్టు సొసైటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. 17న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మరోసారి షెడ్యూల్ ప్రకటించారు. దీంతో బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్లు బంజారభవన్కు చేరుకున్నారు.
మధ్యాహ్నం 1 దాటినా సొసైటీ ఉన్నతాధికారులెవరూ రాకపోవడంతో అక్కడి నుంచి మాసబ్‌ట్యాంక్‌లోని గురుకుల సొసైటీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఉన్నతాధికారులను సంప్రదించేవరకు కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్టు తెలుపలేదని ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్లు వాపోయారు.