కూసుమంచి, ఆగస్టు 23: రోజుమాదిరిగా తన ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తుతెలియని వ్యక్తులు కారు, బైక్‌తో వెంబడించి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల సరిహద్దు సూర్యాపేట జిల్లా రామచంద్రాపురం సమీపంలో చోటుచేసుకుంది. నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన మారోజు వెంకటాచారి(57) నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్నారు.
తన ద్విచక్ర వాహనంపై ఉదయం పాఠశాలకు వెళ్తున్న వెంకటాచారిని కారు, ద్విచక్ర వాహనంతో వెంబడించిన దుండగులు..రోడ్డుపైనే విచక్షణారహితంగా వేటకొడవళ్లతో దాడిచేసి మెడ కోసి పారిపోయారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ జితేందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు క్లూస్‌టీం ద్వారా అన్ని రహదారుల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.