హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం టీడీఆర్ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అభివృద్ధి పేరుతో హైదరాబాద్ మహానగర భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నారని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. 2012లో టీడీఆర్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అనేక సవరణలు జరిగాయని, అయితే నగర భౌగోళిక, పర్యావరణ స్థితిగతులపై, గాలి, నీరు, నేల వంటి సహజ వనరులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ప్రభుత్వాలు జాగ్రత్త వహించాయని చెప్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భౌగోళిక విధ్వంసం, పర్యావరణ పర్యవసనాలపై కనీస అవగాహన లేకుండా జీవో 16 తీసుకొచ్చిందని పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టీడీఆర్ నిబంధనల సవరణతో జరిగే పరిణామాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్ని అంశాలు ఆయన మాటల్లోనే..
ఏమిటీ టీడీఆర్?
ప్రజాప్రయోజనం, అభివృద్ధిని కాంక్షించి చేపట్టే రోడ్ల విస్తరణ, చెరువుల అభివృద్ధి, చారిత్రక కట్టడాల పరిరక్షణ వంటి ప్రాజెక్టులతో ప్రభావితం అయ్యే భూయజమానులకు ‘టీడీఆర్’ రూపంలో పరిహారం అందించాలని 2012లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 168ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం భూమిని కోల్పోయిన వారు పరిహారంగా టీడీఆర్ రూపంలో అదనంగా రెండు అంతస్తులు నిర్మించుకొనే వీలు కల్పించింది. ఇందుకు పరిమితులు విధించింది. టీడీఆర్ అనేది పరిహారానికి ప్రత్యామ్నాయం కాదనీ, అవసరమైతే భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని నిబంధనల్లో స్పష్టంచేసింది.
అడ్డగోలుగా సవరణలు
దాదాపు 14 ఏండ్ల తర్వాత టీడీఆర్ జీవోకు కాంగ్రెస్ ప్రభుత్వం సవరణలు చేసింది. 2012లో తీసుకొచ్చిన జీవో-168 భవన నిర్మాణ నిబంధనలను సవరిస్తూ ఈ ఏడాది జనవరిలో జీవో నంబర్ 16ను అమలుచేసింది. సరిగ్గా 65 రోజుల వ్యవధిలోనే జీవో 16కు మరో సవరణగా జీవో 95ను గత మార్చి 21న రూపొందించింది. ఈ జీవో పట్టణాభివృద్ధి మూల సూత్రాలపై ప్రభావం చూపనున్నది. పట్టణాభివృద్ధి, నిర్మాణ రంగాన్ని ప్రభావితం చేయనున్నది. ఎఫ్టీఎల్, ఎంఎఫ్ఎల్, బఫర్ జోన్ పరిధిలో కట్టుకున్న అక్రమ నిర్మాణాలకు కూడా టీడీఆర్ వర్తింపజేయడమే ముఖ్య ఉద్దేశమని జీవో నంబర్ 16లో ప్రభుత్వం పేర్కొన్నది. దీంతోపాటు 10 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉన్న భవనాలకు అనుమతులు ఇవ్వాలంటే టీడీఆర్ అనివార్యంగా చేసింది. గతంలో స్వచ్ఛందంగా వినియోగించుకొనే టీడీఆర్‌ను, ఇప్పుడు తప్పనిసరిగా మార్చింది. మార్చి 21న వచ్చిన జీవో నంబర్ 95లో టీడీఆర్ సవరణలతో భవన నిర్మాణ రంగంపై అదనపు భారం పడనున్నది. సెట్ బ్యాక్‌లో మినహాయింపులు, అదనపు ఫ్లోర్లకు అవకాశంతోపాటు, కన్వర్షన్ చార్జీలకు బదులుగా టీడీఆర్ వినియోగించుకొనే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు గతంలో పరిమిత పరిధిలోనే టీడీఆర్ వినియోగం ఉండగా, ఇప్పుడు హెచ్ఎండీఏ పరిధిలోని 11 జిల్లాలకు వర్తింపజేసేసేలా జీవో నంబర్ 95తో అవకాశం కల్పించింది. ఒక్క జీవో సవరణ ద్వారా పెను ప్రమాదానికి కారణం అవుతున్నది.
ప్రభావంపై అంచనా లేదా?
ఎలాంటి మౌలిక వసతుల అంచనా, పర్యావరణ సమీక్ష, ప్రజాభిప్రాయ సేకరణ జరుగకుండా అమలు చేస్తున్న జీవోతో కలిగే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నగర భౌగోళిక, పర్యావరణంపై పడే ప్రభావంపై అంచనా గానీ, అధ్యయనం గానీ చేయాలనే విషయాన్ని పక్కనబెట్టింది. హెచ్ఎండీఏ పరిధి వరకు విస్తరింపజేసిన ఈ జీవోకు అనుగుణంగా జలవనరులు, మురుగు నీరు, గాలి నాణ్యత, అర్బన్ హీట్ అంశాలపై కలిగే ప్రభావాన్ని అంచనా వేసే ఇన్ఫ్రా క్యారీయింగ్ కెపాసిటీ అసెస్మెంట్ ఇప్పటివరకు చేయలేదు. 2013లో వచ్చిన భూసేకరణ చట్టం కూడా ఏదైనా ప్రాజెక్టుకు పరిహారం చెల్లించాలంటే కచ్చితంగా సామాజిక ప్రభావ అంచనా చేయాలని చెప్తున్నది. కానీ, ఇక్కడ అవేమీ లేకుండానే నేరుగా పరిహారంగా ఇచ్చే టీడీఆర్ విధానానికి నగరాన్ని బలి చేసేలా వ్యవహరిస్తున్నది.
శిలావ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు
టీడీఆర్‌తో అదనపు ఫోర్లు పెంచుకొనే వీలు కల్పించిన ప్రభుత్వం.. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతుల ప్రకారం నిర్మించాల్సిన కమ్యూనిటీలో ఏర్పాటు చేయాల్సిన ఎస్టీపీల నిబంధనలు మరచింది. ఇప్పుడు టీడీఆర్‌ల వల్ల అదనంగా పెరిగే ఫ్లోర్లతో స్థానికంగా మురుగునీటి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పెరిగిన జనసాంద్రతకు అనుగుణంగా దాదాపు 50 శాతం మురుగు పెరుగొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరి అదనంగా వచ్చే ఈ మురుగునీటిని ఎక్కడ శుద్ధి చేస్తారు? ఇందుకు అవసరమయ్యే నిధులు ఎవరు ఖర్చు చేస్తారు? అన్న విషయాలను జీవోలో ఎక్కడా పేర్కొనలేదు. అదేవిధంగా సెట్‌బ్యాక్‌లో ఇచ్చే మినహాయింపులతో వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతల విస్తీర్ణం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది.
అంతస్తులు పెరిగేకొద్దీ నీటి డిమాండ్ పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఇంకుడు గుంతల పరిమాణాన్ని మాత్రం పెంచలేదు. దీంతో జలవనరులపై అదనపు భారం పడి, భూగర్భజలాలు మరింత త్వరగా అడుగంటిపోతాయి. అదనంగా నిర్మించే అంతస్తులకు అనుగుణంగా సెల్లార్లను తవ్వాల్సి ఉంటుంది. గతంలో లోనికి రెండు, మూడు అంతస్తులు తవ్వితే, అదనపు ఫ్లోర్లతో మరో రెండు ఫ్లోర్ల లోతున భూగర్భంలోకి చొచ్చుకు పోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే వాహనాలకు అనువుగా పార్కింగ్ స్థలం డిమాండ్ 25 నుంచి 40శాతం పెరిగే అవకాశం ఉంటుంది. బేస్మెంట్ కోసం జరిపే తవ్వకాలతో అతి పురాతనమైన గ్రానైట్ శిలలపై ఉన్న నగరం భౌగోళిక స్వరూపం మారిపోతుంది. శిలలను తొలగించేందుకు భారీస్థాయి పేలుడు పదార్థాలను వినియోగించడం ద్వారా చుట్టూ ఉన్న ప్రాంతాలకు ముప్పు ఉంటుంది. ఇలా వీటన్నింటిపై అధ్యయనం చేయకుండానే టీడీఆర్ దందా కోసం నిబంధనలు సడలిస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారనేది అత్యంత కీలకం.
దక్కన్ పీఠభూమికి రక్షణ ఏది?
దక్కన్ పీఠభూమి ప్రపంచంలోనే అతిపురాతన శిలలు, విస్తృతమైన గ్రానైట్ రాతి ఫలకాలతో కూడి ఉన్నది. టీడీఆర్‌లతో అదనపు ఫ్లోర్లు కట్టుకోవచ్చని ప్రభుత్వం చెప్తున్నది. మరి ఈ పీఠభూమికి రక్షణ అక్కర్లేదా? హైరైజ్ పేరిట జరిగే విధ్వంసంతో భూకంపాలను కూడా తట్టుకొని నిలబడే సామర్థ్యం ఈ పీఠభూమికి ఉంటుందా? బహుళ అంతస్తులపై ఉన్న దృష్టి భూగర్భంలో జరిగే మార్పులపై ఎందుకు లేదు? భూమి నుంచి కనీసం 20 నుంచి 40 మీటర్ల లోతున తవ్వకాల కోసం జరిగే బ్లాస్టింగ్, రాక్ కటింగ్, రాక్ సాకెటింగ్ వంటి చర్యలతో అందమైన హైరైజ్ ప్రాజెక్టులు వస్తాయి. కానీ భూగర్భంలో జరిగే విధ్వంసానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ పీఠభూమిని రక్షించుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రభుత్వం ఆలోచించాలి.
సంప్రదింపులు లేవు.. సమీక్షలూ పట్టవు
ప్రభుత్వం టీడీఆర్ పేరిట చేపడుతున్న చర్యలు భవన నిర్మాణ రంగానికి ఎంత ప్రయోజనకరం? ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న విషయాలను ప్రభుత్వం గ్రహించలేదు. కనీసం బహుళ అంతస్తుల భవనాల విషయంలో పెరిగే జనసాంద్రతలో పాటించే నిబంధనలు కానీ, మినహాయింపులను పర్యవేక్షించే వాటర్ బోర్డు, హెచ్ఎండీఏ, రవాణా, కాలుష్య నియంత్రణ మండలి, లేక్ ప్రొటెక్షన్ కమిటీ, ఆర్థికశాఖతో పాటు, పర్యావరణ రంగ నిపుణుల సలహాలు తీసుకోలేదు. కనీసం సంప్రదింపులు చేయలేదు. ఎలాంటి సమీక్షలకు తావు లేకుండానే టీడీఆర్ నిబంధనలను కేవలం కొందరి ప్రయోజనాల కోసం సవరించినట్టుగా తెలుస్తున్నది. ఇవన్నీ విశ్వనగరాన్ని భౌగోళికంగా, పర్యావరణపరంగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయి’ అని దొంతి నర్సింహారెడ్డి హెచ్చరించారు.
అంతర్జాతీయంగా ఉన్న హైరైజ్ నిబంధనలు తెలియదా?
ప్రపంచవ్యాప్తంగా హైరైజ్ భవనాల నిర్మాణం జోరుగా సాగుతున్నది. సింగపూర్, లండన్, చైనా వంటి దేశాలతో హైదరాబాద్ పోటీపడుతున్నది. ఆయా దేశాల్లో హైరైజ్-హారిజంటల్ నిర్మాణాల విషయంలో చాలా పకడ్బందీ నిబంధనలు అమల్లో ఉన్నాయి. వర్టికల్ భవనాలతో పెరిగే జనసాంద్రతతో మౌలిక వసతులపై పడే భారాన్ని అక్కడ పక్కాగా లెక్కిస్తారు. దానికి అనుగుణంగా హైరైజ్ ప్రాజెక్టుల సమీపంలో రోడ్లు, సీవరేజీ లైన్లు, ఎస్టీపీ విస్తీర్ణం, తాగునీటి వసతులు, ఇంకుడు గుంతలు, పార్కింగ్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు, ఓపెన్ స్పేస్ వంటి అంశాలను తప్పనిసరిగా అమలు చేయాలనే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. స్పేస్మేట్ మాడల్, ఫ్లోర్ ఏరియా రేషియో, కౌన్సిల్ ఆన్ టాల్ బిల్డింగ్స్, అండ్ అర్బన్ హ్యాబిటేట్ తదితర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో హైరైజ్ ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్నది. కానీ హైదరాబాద్‌లో మాత్రం టీడీఆర్ ఉంటే చాలు, అదనపు మినహాయింపులతో హైరైజ్ ప్రాజెక్టులకు అనుమతులిస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది.