హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక టీసీఎస్ ఐయాన్ఇంటెలిజెమ్ నిర్వహించిన దేశవ్యాప్త టాలెంట్ టెస్ట్‌లో హైదరాబాద్ విద్యార్థిని విజేతగా నిలిచింది. ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ 7వ ఎడిషన్ సీనియర్ క్యాటగిరీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని సంస్కృతి కొండూరు టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. అదే సంస్థ నిర్వహించిన ‘యూనివర్సల్ వాల్యూస్, ఫైనాన్షియల్ లిటరసీ’ సీనియర్ క్యాటగిరీ టాలెంట్ టెస్ట్‌లోనూ రన్నరప్‌గా నిలిచింది. టీసీఎస్ నిర్వహిస్తున్న టాలెంట్ టెస్టుల్లో సంస్కృతి వరుసగా మూడేండ్లు గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ టెస్ట్‌లో పాల్గొని విజేతగా నిలవడానికి తోడ్పాటునందించిన తల్లిదండ్రులు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి సంస్కృతి కృతజ్ఞతలు తెలిపింది. సంస్కృతి గెలిచిన నేపథ్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా ‘స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు’ను అందుకుంది.
సంస్కృతి బహుముఖ ప్రజ్ఞాశాలి
హెచ్‌సీఎల్ జిగ్సా-2022 జాతీయ స్థాయి ఫైనల్స్‌లో క్వాలిఫయింగ్ రౌండ్లో 97.31 పర్సంటైల్‌తో సంస్కృతి రన్నరప్‌గా నిలిచింది. 2023లో క్వాలిఫయింగ్ రౌండ్లో 99.85 పర్సంటైల్‌తో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఐఐటీ బాంబే యురేకా జూనియర్స్ అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచింది.