కొత్తగూడెం సింగరేణి, జూన్ 19 : యూనియన్లకు అతీతంగా సింగరేణి సంస్థను కాపాడుకుందామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ హటావో.. సింగరేణి బచావో’ నినాదంతో ఈ నెల 23న కొత్తగూడెంలో జరిగే సింగరేణి పరిరక్షణ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేట్‌లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు మాజీ మంత్రి హరీశ్‌రావు, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్రావుతోపాటు కొత్తగూడెం రీజియన్‌లోని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు హాజరవుతారని తెలిపారు.
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు తొమ్మిది నెలలుగా వారి జీతభత్యాలతోపాటు సర్వీసు నష్టపోయారని చెప్పారు. దీనికి కాంగ్రెస్ పార్టీ, యాజమాన్యం, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లు బాధ్యత వహిస్తాయా? అని ప్రశ్నించారు. సంస్థకు సంబంధించి రూ.4 వేల కోట్ల బాండ్ల అమ్మకానికి కారకులెవరని నిలదీశారు. జెన్కో, ట్రాన్స్‌కోలు సింగరేణికి ఇవ్వాల్సి న బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. సింగరేణిలో రూ.1,600 కోట్ల విలువైన 49 లక్షల టన్నుల బొగ్గు, 2014-26వరకు జరుగుతున్న బొగ్గు స్కామ్ గురించి ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బయటపెట్టనున్నట్టు పేర్కొన్నారు.