హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టాస్క్, టీ-ఎస్టీఈపీ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆబ్కారీ, యువజన, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ యువజన సర్వీసుల శాఖ నేతృత్వంలో ఈ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వరల్డ్ యూత్ సిల్స్ డే సందర్భంగా తెలంగాణ అకాడమీ ఫర్ సిల్ అండ్ నాలెడ్జి(టాస్క్) సీఈవో శ్రీకాంత్ సిన్హా, డైరెక్టర్ భాసర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు.
టాస్క్ ద్వారా ఇంజినీరింగ్, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో 400 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఐటీ పార్లో టాస్క్ సంస్థ 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో శాశ్వత ప్రాతిపదికన ఆధునిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నదని, దీనిని అక్టోబర్ 22న ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మహబూబ్‌నగర్ జిల్లాలో 32 కళాశాలల నుంచి సుమారు 7,600 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్టు టాస్క్ సీఈవో మంత్రి దృష్టికి తెచ్చారు. వీరిలో చాలా మంది వివిధ కంపెనీల్లో నియామకాలు పొందారని వివరించారు.