హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆ ఎస్సై ఐదేండ్ల క్రితం విధుల్లో చేరారు.. కొత్త బ్యాచ్ ఎస్సైకావడం.. చురుకుగా పనిచేస్తాడని అతనికి ఉన్నతాధికారులు పెద్ద బాధ్యతను అప్పగించారు. వేల కోట్ల రూపాయలు మోసం చేసిన నిందితుడిని ముంబై నుంచి తీసుకొచ్చేందుకు ఆ ఎస్సై నేతృత్వంలో ఓ బృందాన్ని పంపించారు. ఆ మోసగాడిని పట్టుకొచ్చే క్రమంలో నాటకీయ పరిణామాల మధ్య అతడు తప్పించుకున్నాడు. దీంతో ఘరానామోసగాడిని పట్టుకొని వదిలేసిన నింద టాస్క్ఫోర్స్పై పడగా.. దీని వెనుక కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌లో ఏం జరుగుతున్నది.. అసలు వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించడంలో ఎస్సై మాత్రమే ఉన్నారా.. ఇంకెవరైనా పై అధికారి పాత్ర కూడా ఉందా.. అనే కోణంలో పోలీసుబాస్ సీరియస్‌గా విచారణ మొదలుపెట్టారు.
కీలక పని టాస్క్‌ఫోర్స్‌కు అప్పగింత
ఓ ఘరానా మోసగాడు తప్పించుకోవడం వెనుక టాస్క్‌ఫోర్స్ ఎస్సై పాత్రపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసువర్గాల్లో చర్చ జరుగుతున్నది. మద్యం సహా వివిధ వ్యాపారాల పేరుతో వేల కోట్ల మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ఈ మోసగాడిని అరెస్ట్ చేయాలని పైస్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆదేశాలు అందుకున్న ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆ నేరగాడిని పట్టుకునే పనిని టాస్క్‌ఫోర్స్ విభాగానికి అప్పగించారు. ఇందుకోసం ఓ ఎస్సై నేతృత్వంలో పోలీసు బృందాన్ని సిద్ధం చేశారు. సాంకేతిక ఆధారాలను పరిశీలించిన టీమ్ సదరు మోసగాడు ముంబైలో ఉన్నట్టు గుర్తించింది. అతనిని పట్టుకోవడానికి ఎస్సై నేతృత్వంలోని బృందం నగరం నుంచి ప్రత్యేక వాహనంలో వారం రోజుల క్రితం ముంబైకి చేరింది. అక్కడ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడిని హైదరాబాద్‌కు తరలించే క్రమంలో అసలు డ్రామా నడిచింది.
రూ.2కోట్లకు డీల్ కుదిరింది..!
ఆ మోసగాడిని తప్పించేందుకు మార్గమధ్యంలోనే ఆ ఎస్సై హైడ్రామా నడిపినట్టు తెలుస్తున్నది. 2020 బ్యాచ్, సెంట్రల్‌జోన్‌కు చెందిన ఆ ఎస్సై విధుల్లో చేరినప్పటినుంచే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులే చెప్తున్నారు. మోసగాడిని హైదరాబాద్ తరలించే సమయంలో తనతో వచ్చిన బృందాన్ని ఒక వాహనంలో ఎక్కించి ఆ ఎస్సై మాత్రం మోసగాడితో కలిసి మరో వాహనంలో ప్రయాణించాడు. రెండు వాహనాల మధ్య కనీసం 30 కిలోమీటర్ల దూరం ఉండేలా ఏర్పాటు చేసుకున్నట్టు చెప్తున్నారు. ఆ సమయంలో మోసగాడికి, ఎస్సైకి మధ్య రూ.2 కోట్ల డీల్ కుదిరినట్టు సమాచారం. తనను వదిలేయాలని మోసగాడు అడగడంతో ఎస్సై తన గాడ్‌ఫాదర్‌తో మాట్లాడాడని, అతడు పై అధికారితో మాట్లాడమని చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఎక్కడా అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేస్తావో చూసుకోమని, ఇందుకోసం నిందితుడు ఎంత ఆఫర్ చేస్తున్నాడో కనుక్కుంటే దానిని బట్టి నిర్ణయిద్దామని ఆ పైఅధికారి చెప్పినట్టు పోలీసుల్లో చర్చ జరుగుతున్నది. మొదట ఐదు కోట్ల నుంచి మొదలైన బేరం చివరకు రూ.2 కోట్లకు ఓకే అయినట్టు తెలిసింది. ఈ డబ్బును మార్గమధ్యంలో ఓ హోటల్లో అతని కుటుంబసభ్యుల ద్వారా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు సదాశివపేటలో మోసగాడు తన కుటుంబాన్ని కలిసి ఎస్సైకి డబ్బు ముట్టజెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. వెనకాల వస్తున్న పోలీసు బృందం వచ్చే సమయానికి ఎస్సై మోసగాడు పారిపోయాడంటూ ఇటు ఉన్నతాధికారులకు అటు తన బృందంతో చెప్పుకుని లబోదిబోమన్నాడు.
ఎస్సై ముడుపుల వ్యవహారంపై సజ్జనార్ సీరియస్.. !
ఆ మోసగాడిని పట్టుకోవడానికి మళ్లీ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దర్యాప్తు చేసే క్రమంలో అసలు వ్యవహారం వెలుగుచూసింది. మోసగాడిని వదిలేసేందుకు కోట్ల రూపాయల డీల్ కుదిరినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇందులో ఒక్క ఎస్సై మాత్రమే ఇంత పెద్ద డీల్ చేయగలడా అనే కోణంలో విచారించిన ఉన్నతాధికారులు మరో ఇద్దరు పోలీసు పెద్దమనుషుల ప్రమేయంపై ఆరా తీశారు. పోలీసుశాఖకు ప్రత్యేకించి టాస్క్‌ఫోర్స్‌కు అప్రతిష్ట కలిగిస్తున్న ఈ వ్యవహారంపై సిటీ పోలీసు కమిషనర్ సజ్జనార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ ఎస్సైని తన కార్యాలయానికి పిలిపించుకుని మొత్తం ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సైతోపాటు ఇంకెందరు ఈ వ్యవహారంలో భాగస్వాములయ్యారో చెప్పాలని కమిషనర్సిపి అడగడంతో ఆ ఎస్సై తనకు ఏమీ తెలియదని బుకాయించినట్టు తెలిసింది. మోసగాడు మళ్లీ పట్టుకునిరావాలని ప్రత్యేక బృందాలను ఆదేశించిన సీపీ ఆ ఎస్సైపై కూడా కఠినచర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలిసింది.