హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల విడుదల చేసిన జీవోలో స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావును నియమించారు. తాజాగా ప్రభుత్వం ఆయన స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఎండీ తదనుగుణంగా చర్యలు తీసుకుంటారని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఈవో) సీహెచ్ ప్రియాంక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): ముస్లిం దూదేకుల వర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముస్లిం దూదేకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ రాజమ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సబ్సిడీ రుణాల మంజూరు, తదితర పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇప్పటికీ మైనారిటీ బీసీ వర్గాలకు క్షేత్రస్థాయిలో సరైన ప్రయోజనాలు దక్కడం లేదని వాపోయారు.