జగిత్యాల కలెక్టరేట్, జూన్ 16: ‘మీ పెట్టుబడికి మూడింత ఆదాయం’ అంటూ ప్రకటనలతో బురిడీ కొట్టించిన ‘సోలార్ గోల్డ్ కార్డ్’ యాప్ బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పేరిట పెద్ద మొత్తంలో వసూలు చేసింది. ఈ ఘటన జగిత్యా ల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా.. ‘రూ.1,800 పెట్టుబడి పెడితే 75 రోజులపాటు రోజూ రూ.420 రాబడి, రూ.4,500 డిపాజిట్ చేస్తే రోజూ రూ.వెయ్యి, రూ.9,500 పెడితే రోజూ రూ.2,500, రూ.35 వేలకు వంద రోజులపాటు రోజూ రూ.1,400 చెల్లిస్తాం. డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిలో సగం మొత్తం చెల్లిస్తాం’ అంటూ సోలార్ గోల్డ్ కార్డ్ అనే ఆన్లైన్ యాప్ నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ వాట్సాప్‌కు లింక్ వచ్చింది. దానిని చూసిన సదరు వ్యక్తి, నిజమేనని నమ్మి లింకు ఓపెన్ చేశాడు. వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయగానే సోలార్ గోల్డ్ కార్డ్ 155వ వాట్సాప్ గ్రూపులో చేరిపోయాడు. ఆ తర్వాత ఫోన్ పే ద్వారా రూ.480 పెట్టుబడి పెట్టాడు. యాప్‌లో చూపిన విధంగానే సదరు వ్యక్తి ఫోన్ పే వాలెట్లో రోజూ రూ.120 చొప్పున జమయ్యాయి. దీంతో యాప్‌పై సదరు వ్యక్తికి నమ్మకం కుదిరింది. దీంతో ఏప్రిల్ 27న 75 రోజుల కాలపరిమితితో రూ.13,500 పెట్టుబడి పెట్టగా దీనికి సైతం రోజూ రూ.400 చొప్పున జమకావడం ప్రారంభమైంది.
సదరు వ్యక్తికి యాప్‌పై మరింత నమ్మకంతోపాటు అత్యాశ పెరిగింది. మే 5న రూ.35 వేలు పెట్టుబడి పెట్టగా, మరుసటి రోజు నుంచి రోజుకు రూ.1,400 జమకావడం మొదలైంది. మూడు సార్లు పెట్టుబడి పెడితే క్రమం తప్పకుండా యాప్ వారు డబ్బులు చెల్లిస్తుండటంతో మే 12న అప్పు తెచ్చి మరీ రూ.1.52 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనికి రోజూ రూ.7,200 రావాల్సి ఉండగా, ఆరు రోజులపాటు చెల్లించిన యాప్ నిర్వాహకులు మే 19వ తేదీ నుంచి నిలిపివేశారు. సర్వర్ ప్రాబ్లం ఉంది, పలువురు బ్యాంకు సిబ్బంది సెలవులో ఉన్నారు. మే 23 నుంచి ప్రతి ఒక్కరికి యథావిధిగా చెల్లిస్తామంటూ మెసేజ్‌లు పం పారు. మే 23న యాప్‌లోకి లాగిన్ కాగా, యాప్‌ను మూసివేసినట్టుగాఅందులో ఉండటంతో సదరు వ్యక్తి కంగుతిన్నాడు. యాప్‌లో పెట్టుబడులు పెట్టిన పలువురిని సంప్రదించగా, తాము కూడా ఇలాగే మోసపోయామని లబోదిబోమన్నారు. ఇలా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వంద మంది పెట్టుబడి పెట్టి మోసపోయినట్టు సమాచారం. ముఖ్యంగా జగిత్యాల, మల్యాల మండలాల్లో ఈ యాప్ బాధితులు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. పెట్టుబడిదారుల వాట్సాప్ గ్రూపు నంబర్లు 450కిపైగా ఉన్నట్టు తేలగా, మోసం గురించి ఎవరికీ చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక బాధితులు లోలోన కుమిలిపోతున్నట్టు సమాచారం.