హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): నాలుగు వందల మంది విద్యార్థులకు ఆయా స్టార్టప్ కంపెనీలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించినట్టు టీహబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. టీహబ్ ఏడో వార్షిక వేడుకల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాయదుర్గంలోని టీహబ్ ఇంటర్న్‌షిప్ మేళా నిర్వహించారు.
ఈ మేళాలో పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, 55కు పైగా వర్సిటీలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీహబ్ ప్రతినిధులతో కలిసి ఎంఎస్ రావు మాట్లాడుతూ ఈ మేళాలో 2,600కు పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 75కు పైగా స్టార్టప్ కంపెనీలు ఇంటర్న్‌షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. విద్యార్థులకు మొదట ఇంటర్న్‌షిప్ అవకాశాలు వచ్చినా, భవిష్యత్తులో వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమించుకొనే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టూమాగ్జ్ వ్యవస్థాపకుడు చరణ్ లకరాజు తదితరులు పాల్గొన్నారు.