హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ సీనియర్లు ఏకమవుతున్నారు. ఆయనను పార్టీ పదవి నుంచి దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇంతకాలం మీడియా సమావేశాల్లో విమర్శలు గుప్పించిన సీనియర్లు ఇప్పుడు ప్రత్యేక సమావేశాలతో కాక పుట్టిస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించవద్దన్న అధిష్ఠానం ఆదేశాలను కూడా బేఖాతర్ చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. వారం రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఇంట్లో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు తదితర సీనియర్ నేతలు భేటీ అయ్యారు. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లోని అశోక హోటల్లో మర్రి శశిధర్‌రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు, మరో నేత శ్యామ్మోహన్ సమావేశమయ్యారు.
ఏఐసీసీ నేతలు అసంతృప్త నేతలకు ఫోన్ చేసి సమావేశం నిర్వహించవద్దని, ఒకవేళ నిర్వహిస్తే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించినా వీరు లెక్క చేయలేదు. రేవంత్‌రెడ్డి అనుకూల వర్గం నేతలు కూడా హోటల్‌కు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సీనియర్లు మెత్తబడలేదు. రేవంత్ వర్గీయులను అక్కడి నుంచి పంపించి, సమావేశం నిర్వహించారు. రేవంత్‌రెడ్డి పార్టీని నాశనం చేస్తున్నారని, సొంత నిర్ణయాలతో పార్టీ లైన్‌ను క్రాస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీనియర్లను పట్టించుకోకుండా అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
సంస్థాగత లోపాలు సరిదిద్దాలి: మర్రి శశిధర్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. సమావేశం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగత లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. తమది అసమ్మతి కాదని, బాధ్యత గల నేతల సమావేశమని చెప్పారు. పార్టీ బాగు కోసం సమావేశాలు ఇంకా కొనసాగుతాయని స్పష్టంచేశారు.
నన్ను సస్పెండ్ చేసే దమ్ముందా?: జగ్గారెడ్డి సవాల్
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రేవంత్‌రెడ్డితో సహా ఒక్కొక్కరి బాగోతం బయటపెడతానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. తనను సస్పెండ్ చేసే దమ్ము ఉన్నదా? అని రేవంత్‌రెడ్డిని సవాల్ చేశారు. కోవర్ట్ ముద్రవేస్తే చెప్పుతో కొడతానంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ వన్‌మ్యాన్ షో చేస్తున్నాడని, పార్టీ లైన్లో పని చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని విమర్శించారు. సమావేశ నిర్వహణపై షోకాజ్ నోటీసులు ఇస్తే సమాధానం ఇస్తామని తెలిపారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తెలిపారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తనపై ఆయన మనిషిని నిలబెట్టి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. అలా గెలిపిస్తే రేవంత్‌రెడ్డి హీరో అని ఒప్పుకుంటానని చెప్పారు.