Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తేతెలంగాణ): ‘అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరాఫరా కోసం కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ ద్వారా టెండర్లను పారదర్శకంగా నిర్వహించాలి.. తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకే బాధ్యతలు అప్పగించాలి’ అని మంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ జారీచేసిన ఆదేశాలు బుట్టదాఖలు అవుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారంపై మీడియాలో నూ కథనాలు వచ్చాయి. దీంతో కొన్ని జిల్లాల టెండర్లను రద్దుచేశారు. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు కాంట్రాక్టర్ల ఎంపికకు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నిబంధనల మాటున తమ అనుయాయులకు కాంట్రాక్ట్‌ను కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తగ్గనున్న పోటీ.. పెరగనున్న ధర
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పుకు ప్రభుత్వం గరిష్ఠ ధర కిలో ఒక్కంటికి రూ.164గా నిర్ణయించింది. మహబూబ్‌నగర్‌లో కొత్త నిబంధనల ప్రకారం ఉమ్మడి జిల్లా కాంట్రాక్టర్లకే టెండర్లు దక్కే అవకాశం ఉం టుంది. ఇతర జిల్లాల గుత్తేదారులకు అవకాశం లేకపోవడంతో పోటీ తగ్గనున్నది. దీంతో ప్రభు త్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు కోట్ చేసే అవకాశం కనిపిస్తున్నది. ఫలితంగా ప్రజాధనం లూటీ అయ్యే ప్రమాదం ఉన్నదని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు కాంట్రాక్లర్ల హక్కులను హరించివేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లేని నిబంధనలను అమలు చేయడంలోని అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుడు సైతం ఇదేవిధంగా ఎక్కువ ధరకు కందిపప్పు ను సరాఫరా చేయడంపై విమర్శలు వచ్చాయి. నిరుడు వాస్తవంగా ప్రభుత్వం గరిష్ఠ ధర కిలో రూ.165 ఉండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.183 టెండర్‌ను దక్కించుకున్నారు. దీంతో అధిక ధర చెల్లించాల్సి వచ్చింది.
ఉమ్మడి జిల్లా కాంట్రాక్టర్లకే అవకాశం
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అంగన్వాడీలకు కందిపప్పు సరఫరా చేసే కాంట్రాక్టర్ల ఎంపికకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంట్రాక్టర్లకే టెండర్ దాఖలుచేసే అవకాశాన్ని కల్పించారు. ఇతర జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్ల టెండర్లను అనర్హతగా గుర్తించి డిస్క్వాలిఫై చేసినట్టు తెలుస్తున్నది. ఈ నిబంధనలను ఉమ్మడి జిల్లాలోని కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిండికేట్‌గా మారి ప్రజాధనాన్ని అప్పనంగా కొల్లగొట్టేందు కు సిద్ధమైనట్టు సమాచారం. ఇందుకు అక్కడి ఐసీడీఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖలోని కొందరు అధికారులు సైతం సహకరిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.