హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఉదంతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇందుకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్ సహా ముగ్గురిపై మంగళవారం సస్పెన్షన్ వేటు వేసింది. సోమవారం జరిగిన ఘటనపై విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థులకు భోజనం అందించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గురుకుల వార్డెన్ జ్యోతి, కుక్ వీ వెంకట్రామ్, కాంట్రాక్టర్ ఐలయ్యను విధుల నుంచి తొలగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి హెచ్చరించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వారిని హైదరాబాద్కు తరలించి ప్రత్యేక వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.