దమ్మపేట రూరల్, డిసెంబర్ 28 : ఓ సర్వేయర్ భూమిని సర్వే చేసిన రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి శివారులో మద్దినేని మమత పట్టాదారు పాస్‌పుస్తకం కోసం రెండు నెలల క్రితం దరఖాస్తు చేసున్నారు. మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం సర్వే రిపోర్టు కోసం రూ.1.5 లక్షలు లంచం డిమాండ్ చేసి.. రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సర్వేయర్‌కు రూ.50 వేలు ఇచ్చేందుకు శనివారం మమత సోదరుడు వెంకట్ ఫోన్‌చేశాడు. మందలపల్లి శివారు గాంధీనగరం ఇటుక బట్టీవద్ద రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సర్వేయర్‌ను పట్టుకున్నారు.
26న మంత్రి తనిఖీ, 28న ఏసీబీ దాడి
దమ్మపేట తహసీల్ కార్యాలయాన్ని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 26న ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ క్రమంలోనే తాజాగా సర్వేయర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం జిల్లాలో సంచలనంగా మారింది.