అచ్చంపేట రూరల్, జూన్ 20 : ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు మళ్లీ సర్వే మొదలైంది. సొరంగం పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కసరత్తు ప్రారంభించింది. సొరంగం పొడవు 43.93 కిలోమీటర్లు కాగా.. అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఇన్లెట్ వైపు నుంచి 13.93 కిలోమీటర్లు పనులు పూర్తవగా.. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద అవుట్లెట్ 20.43 కిలోమీటర్ల మేర పూర్తయింది. రెండు వైపులా 9.53 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వాల్సి ఉన్నది. కాగా దోమలపెంట వద్ద సొరంగంలో పనులు చేస్తుండగా.. ఫిబ్రవరి 22న పైకప్పు కూలి 8 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు మృతదేహాలను వెలికితీయగా.. మిగితా వారి ఆచూకీ లభించలేదు.
తర్వాత పనులు చేపడుతారా? నిలిపివేస్తారా? అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. సొరంగం ఉన్న భూమి పైభాగాన్ని.. లోపలి భాగంలో భూ పరిస్థితులను తెలుసుకోవడానికి.. నల్లవాగు, మల్లెలతీర్థం, శ్రీశైలం మిగులు జలాలు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో భవిష్యత్లో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయడానికి ఎన్జీఆర్ఐ నిపుణులు తివారి ఆధ్వర్యంలో డెన్మార్క్ నుంచి అత్యాధునిక పరికరాలను తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక వైమానిక దళ హెలికాఫ్టర్ ఆధారంగా సర్వే పనులు చేపట్టనున్నట్టు సమాచారం. టన్నెళ్లపై అనుభవమున్న అధికారులను నియమించేందుకు ఆర్మీ సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖకు లెటర్ రాయగా.. అంగీకారం తెలుపుతూ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, హర్పాల్ సింగ్ను ఎంపిక చేసింది. వీరు రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లనున్నారు.