హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ దివంగత సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి ఆదివారం అప్పగించనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం శుక్రవారం రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రసుత్తం ఆయన భౌతికకాయం గచ్చిబౌలిలోని కేర్ దవాఖానలో ఉన్నది. ఆదివారం ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయమైన మఖ్దూంభవన్‌కు పార్థీవదేహాన్ని తరలిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మగ్ద్దూంభవన్లోనే ప్రజల సందర్శనార్థం ఉంచుతా రు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీ వరకు ప్రభుత్వ అధికార లాంఛనాల ప్ర కారం అంతిమయా త్ర నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీ యాజమాన్యానికి అప్పగిస్తారు. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎర్ర చొకాలు, మహిళలు ఎర్ర చీరలు ధరించి అంతిమయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళులర్పించడానికి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వామపక్ష, ఇతర రాజకీయ పార్టీలు నాయకులు, ఇతర ప్రముఖులు వస్తారని తెలిపారు.
పలువురు ప్రముఖుల సంతాపం
సురవరం సుధాకర్‌రెడ్డి మృతికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి సీతక్క, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సీపీఐ నారాయణ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠారెడ్డి, పుట్ట లక్ష్మణ్ తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకుడు, ఈ తరానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.
నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన కమ్యూనిస్టు : సిరికొండ సురవరం సుధాకర్‌రెడ్డి.. నమ్మిన సిద్ధాంతాన్ని ఆజన్మాంతం ఆచరించిన నిజాయితీ కలిగిన కమ్యూనిస్టు అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఒక ప్రకటనలో కొనియాడారు.
పీడిత ప్రజల బంధువు సురవరం : గోరటి
వివాదరహితుడు, పీడితుల బంధువు సురవరం సుధాకర్‌రెడ్డికి వినమ్ర జోహార్లు’అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఒక ప్రకటనలో కొనియాడారు. సైంద్ధాతిక నిబద్ధత కలిగిన తొలితరం వారసత్వాన్ని కొనసాగించిన నేత అని పేర్కొన్నారు. ‘విస్తృత అధ్యయనశీలి, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ విస్తృతిని ఆకలింపు చేసుకున్న గొప్ప నేత అని పేర్కొన్నారు.
అందరి ప్రేమను పొందిన గొప్ప కమ్యూనిస్టు : సీపీఐ
విభిన్న రాజకీయ విధానాలు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీల అభిమానాన్ని, అందరి ప్రేమను పొందిన గొప్ప కమ్యూనిస్టు సురవరం సుధాకర్‌రెడ్డి అని పలువురు సీపీఐ ముఖ్య నాయకులు కొనియాడారు. హిమాయత్‌నగర్‌లోని మగ్దూంభవన్‌లో సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళలర్పించారు. సుధాకర్‌రెడ్డికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి, సీపీఐ శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యం, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిలు తకళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహ తదితరులు నివాళులర్పించారు. ఎంసీపీఐ(యూ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి సంయుక్త ప్రకటనలో ప్రగాఢ సంతాపం ప్రకటించారు.