(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రజా తీర్పును పక్కనబెట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై (MLAs Defection) చర్యలు తీసుకోకుండా నాన్చివేత ధోరణితో సభాపతి (Speaker) ప్రవర్తించడం ఎంతమాత్రం తగదని సుప్రీంకోర్టు (Supreme Court) తేల్చి చెప్పింది. గోడదూకిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినా, స్పీకర్ పెడచెవిన పెట్టడం ముమ్మాటికీ నేరపూరిత కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 1993-94లో జరిగిన మనీలాల్ సింగ్ వర్సెస్ డాక్టర్ హెచ్ బోరాబాబు సింగ్ (1993) కేసులో అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకానొక దశలో స్పీకర్‌పై ధర్మాసనం ధిక్కార చర్యలకు దిగింది. అయితే, కోర్టుకు స్పీకర్ బోరాబాబు సింగ్ క్షమాపణలు చెప్పడంతో ఆయనపై చర్యలను నిలిపేసింది. అనంతరం పార్టీమారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై కోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజుల్లోనే సదరు స్పీకర్ అనర్హత వేటు వేశారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా తెలంగాణ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై సోమవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మణిపూర్ ఉదంతంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
మణిపూర్‌లో ఏం జరిగింది?
1990లో 54 స్థానాలు (ఇప్పుడు 60 స్థానాలు) ఉన్న మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 28 సీట్లు అవసరం. 24 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరికొందరి మద్దతు అవసరమైంది. కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు మిగతా పార్టీలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ మణిపూర్ అసెంబ్లీ సెక్రటరీ మనీలాల్ కోర్టులో కేసు వేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. 1992లో దీనిపై విచారించిన సుప్రీంకోర్టు, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆరుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడంలో నాన్చివేత ధోరణి ప్రదర్శించారు. అప్పటికే రెండు, మూడు సార్లు స్పీకర్‌ను హెచ్చరించిన అత్యున్నత ధర్మాసనం1994, జనవరి 11న జరిగిన విచారణ సమయంలో స్పీకర్ తీరుపై నిప్పులు చెరిగింది.
రాజ్యాంగ రక్షణ ఉండదు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఏండ్లకేండ్లు నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్న మణిపూర్ స్పీకర్ హెచ్ బోరాబాబు సింగ్‌పై 1994, జనవరి 11న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాల నుంచి స్పీకర్‌కు సైతం రాజ్యాంగ రక్షణ ఉండబోదని తెలిపింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పీకర్‌ను ఆదేశించినా, స్పీకర్ దాన్ని పట్టించుకోకపోవడం ముమ్మాటికీ నేరపూరిత కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని గుర్తుచేసింది. శాసనసభ స్థిరత్వాన్ని, ప్రాథమిక హక్కులను కాపాడటానికి.. రాజ్యాంగ సూత్రాలు అమలు కావడానికి ఈ కేసులో న్యాయస్థానమే తుది నిర్ణేత అని తెలిపింది. తమ ఆదేశాలను పాటించకుండా కోర్టు గౌరవాన్ని స్పీకర్ తగ్గించారని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 129, రూల్ ఆఫ్ లా కింద.. సాధారణ పౌరులతో పాటు స్పీకర్ కూడా కోర్టు ముందు సమానమేనన్న ధర్మాసనం.. కేసు విచారణ సమయంలో సదరు స్పీకర్ తమ ముందు హాజరయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టుకు క్షమాపణలు
స్పీకర్ తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే పక్కనబెట్టారన్న సుప్రీంకోర్టు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 కింద నేరపూరిత కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్పందించేందుకు స్పీకర్‌కు ఒక అవకాశమిచ్చింది. దీంతో స్పీకర్ బోరాబాబు సింగ్ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తన చర్యలపై విచారం వ్యక్తం చేసిన స్పీకర్.. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకొంటానని మాటిచ్చారు. దీంతో స్పీకర్ క్షమాపణలను అంగీకరించిన కోర్టు.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్పీకర్‌పై ధిక్కరణ ప్రొసీడింగ్స్‌ను కూడా నిలిపివేసింది. వాదనలు పూర్తయిన కొన్నిరోజులకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. తగిన మెజార్టీ లేకపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. ప్రస్తుతం తెలంగాణ స్పీకర్ ముందు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని తెలంగాణవాదులు చెప్తున్నారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటేస్తారా, కోర్టు ధిక్కరణ పర్యావసనాలను ఎదుర్కొంటారా అని ప్రశ్నిస్తున్నారు.