Supreme Court | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని వంద ఎకరాల్లో చెట్లను ధ్వంసం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆ వంద ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ఓ ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించింది. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంతమంది అధికారులు జైలు పాలవుతారో తమకు తెలియదని హెచ్చరించింది. చెట్లను కూల్చివేయడాన్ని సమర్థించుకోవడానికి బదులు.. అక్కడ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం మంచిదని సూచించింది.
వంద ఎకరాల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించడం, పర్యావరణాన్ని కాపాడటం, ఆ స్థలంలోకి బుల్డోజర్ల రాక, అనుమతి లేకుండా చెట్లను కూల్చివేయడం వంటి అంశాల వరకే తమ విచారణ పరిమితమని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం చెట్లను తొలగించడాన్ని సుమోటోగా స్వీకరించిన కేసుపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ, మేనక గురుస్వామి, అమికస్ క్యూరీ కే పరమేశ్వర్, గోపాలశంకర్ నారాయణ్, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పీ మోహిత్‌రావు, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఇంప్లీడ్ పిటిషన్ ద్వారా సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ పర్యావరణానికి హాని కలిగించడం, అడవులను ధ్వంసం చేయడంపై ఘాటుగా స్పందించారు. ‘మా ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ ఆ ప్రదేశాన్ని సందర్శించి ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదికపై స్పం దించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయమిస్తున్నాం. ఈలోగా తెలంగా ణ వన్యప్రాణి సంరక్షకుడు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి వన్యప్రాణులను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం. చెట్ల పునరుద్ధరణ ఎలా చేస్తారు? ఎంతకాలంలో చేస్తారు? జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలి’ అని ఆదేశించారు.
‘వంద ఎకరాల్లో పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారా.. లేక జైలుకు వెళ్తారా? మీరు స్పం దించకపోతే ఒక ఆరు నెలల్లో తాత్కాలిక జైలును అక్కడే నిర్మింపజేస్తాం. మంచి చెరువు కూడా అక్కడ ఉంది. దాని పక్కనే జైలు ఉం టుంది. అందులోనే అధికారులందరినీ ఉంచు తాం. మా ఆదేశాలు పాటించకపోతే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యులవుతారు’ అని హెచ్చరించారు. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని అంటూ కేసును వచ్చే నెల 15కు వాయిదా వేశారు.
జస్టిస్ గవాయ్ మాట్లాడుతున్నపుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ జోక్యం చేసుకుంటూ అక్కడ కొన్ని అనుమతి ఉన్న చెట్లనే నరికివేశారని, దీనికి వాల్టా వంటి చట్టంతో పనిలేదని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. 1996 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఇలాంటి కేసుల్లో ప్రామాణికమని చెప్పారు. అనుమతులున్న చెట్లనే నరికివేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దని అన్నారు.
తాము కంచగచ్చిబౌలిలోని భూముల యాజమాన్య హక్కుల గురించి ఇక్కడ చర్చించడంలేదని, 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా అక్కడ జరిగిన చెట్ల నరికివేత, వన్యప్రాణులకు జరుగుతున్న హాని గురించే మాట్లాడుతున్నామని చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చి ఉంటే.. అలాంటి అనుమతులు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా.. లేదా అన్నది చూస్తామని అన్నారు.
అధికారులు లేదా మంత్రుల వివరణలను తాము పట్టించుకోబోమని, 1996లో జారీ చేసిన ఆదేశాలను ఎలా ఉల్లంఘించారో వివరించాలని స్పష్టంచేశారు. తమ ప్రాథమిక ఆందోళన పర్యావరణ పరిరక్షణ, దానికి జరిగిన హాని గురించి మాత్రమేనని, 1996 నాటి తమ తీర్పులోని అంశాలకు విరుద్ధంగా చేపట్టిన ఎటువంటి చర్యనూ తాము సహించబోమని తేల్చిచెప్పారు.
‘మీరు పెద్ద ఎత్తున చెట్లను కొట్టివేస్తున్నపుడు అక్కడ ఉన్న వ్యన్యప్రాణులు ఆవాసం కోసం పరుగులు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే వాటిని వీధి కుక్కలు తరిమాయి. కొన్ని జంతువులు చనిపోయాయి కూడా. వీటిని చూసినపుడు మాకు ఆందోళన కలిగింది. అవసరం అనుకుంటే.. ఆ వంద ఎకరాల్లోనే కాదు.. అక్కడున్న సుమారు 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టవద్దని ఆదేశాలు ఇవ్వగలం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుబాబుల్ వంటి చెట్లతోపాటుకొన్ని పొదలను నరికివేయడానికి సంబంధించి సొంత మినహాయింపులు ఇచ్చుకున్నదని అభిషేక్ సింఘ్వీ చెప్పగా.. 1996 డిసెంబర్ 12 తీర్పునకు మీకు మీరు మినహాయింపులు ఇచ్చుకోవడమేంటి.. అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘మీ ప్రధానకార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆమెను కాపాడుకోవాలనుకుంటే, ఆ వంద ఎకరాల్లో పునరుద్ధరణ చర్యలు ఏ విధం గా చేపడతారో ఓ ప్రణాళికను రూపొందించం డి. లేదా మీ అధికారులు ఎంతమంది తాత్కాలిక జైలుకు వెళతారో తెలియదు’ అని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారన్నది రాష్ట్రప్రభుత్వ అధికారులు చెప్పాలని అన్నారు. అక్కడ వన్యప్రాణులను రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తదుపరి విచారణ సమయంలో వన్యప్రాణుల సంరక్షకుడు చెప్పాలని పేర్కొన్నారు. ముంబై, చెన్నై, జైపూర్ నగరాల్లోలాగా హైదరాబాద్‌లో కూడా గ్రీన్ లంగ్స్ ఉండాలని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో వీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ముంబైలో సెక్రటేరియట్, మెట్రో నిర్మాణాల అనుమతులకు సంబంధించిన కేసు సుమారు రెండు దశాబ్దాలపాటు కొనసాగిందని జస్టిస్ గవాయ్ చెప్పారు. ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అన్నది ముఖ్యం కాదని, చెట్లు ఉన్నాయా.. వన్యప్రాణులు ఉన్నాయా అన్నది ముఖ్యమని అన్నారు. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనులను తామేమీ అడ్డుకోవడంలేదని, కానీ, చట్టాలను గౌరవించి అన్ని రకాల అనుమతులు తీసుకున్నారా.. లేదా అన్నది ముఖ్యమని చెప్పారు. చార్ధామ్ యాత్ర.. యుద్ధక్షేత్రాలకు వెళ్లే రోడ్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం, సంబంధిత ప్రభుత్వాలు, శాఖలు ఏండ్లకు ఏండ్లు అనుమతుల కోసం పోరాడాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
కంచ గచ్చిబౌలి భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందినవని, అయినప్పటికీ సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడ అన్ని రకాల పనులను నిలిపివేశారని అభిషేక్ సింఘ్వీ చెప్పారు. 263 పేజీలతో కూడిన సుదీర్ఘ అఫిడవిట్‌ను ఆయన న్యాయస్థానం ముందుంచారు. 2004 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూముల కోసం న్యాయపోరాటం చేస్తున్నదని, 2024లో న్యాయస్థానం ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.
ఏఐతో అక్కడ ఏనుగులు కూడా ఉన్నట్టు ప్రచారం చేశారని, అక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ అబద్ధాలను ప్రచారం చేశారని, అవాస్తవ విషయాలతో వీడియోలను సర్క్యులేట్ చేశారని చెప్పారు. వాల్టా చట్టం పరిధిలో ఉన్న మినహాయింపులకు లోబడే ప్రభుత్వం చెట్లను కొట్టివేసిందని పేర్కొన్నారు. అక్కడ సుబాబుల్ చెట్లు, చిన్నచిన్న పొదలతో ఉన్న చెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రణాళికను రూపొందించి కోర్టుకు చెప్తామని తెలిపారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో చట్టం ఉల్లంఘన జరిగినట్టు కనిపిస్తున్నదని అమికస్ క్యూరీ పరమేశ్వర్ కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వీయ అనుమతులు తీసుకోవడం 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమని చెప్పారు. ఇదంతా ఒకెత్తయితే.. అసలు ఎలాంటి అనుమతులు తీసుకోకముందే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మౌలిక సదుపాయాల సంస్థ ఈ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లను సమీకరించిందని చెప్పారు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర సాధికార కమిటీ తన నివేదికలో పేర్కొన్నదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల తొలగించడానికి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మహతా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు, మెట్రో వంటి ప్రాజెక్టులు చేపట్టే సందర్భంగా కూడా చెట్ల తొలగింపు అంశంలో కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిందేనని, ఎవ్వరికీ మినహాయింపులు ఉండవని అన్నారు. ఐటీ పార్కు పేరుతో తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టిందని, ఇక్కడ అనుమతులను తీసుకోలేదని స్పష్టం చేశారు.
కంచ గచ్చిబౌలిలోని వంద ఎకరాల భూమిలో వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నపుడు డజన్ల కొద్దీ బుల్డోజర్లను మోహరించి చెట్లను ఎందుకు తొలగించారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. చెట్లను కొట్టివేయడంతో అక్కడ ఎంతోకాలంగా ఉంటున్న పక్షులు, వన్యప్రాణుల పరిస్థితి ఏమవ్వాలని ప్రశ్నించారు. జంతుజాలం నివాసాలను కోల్పోయి జనావాసాల్లోకి వచ్చాయని, కొన్నింటిని వీధికుక్కలు కొరికి చంపాయని, వాటి ఫొటోలను తాను కూడా చూశానని చెప్పారు. అలా జరగడం బాధకరమని అన్నారు. ప్రైవేటు అడవులైనా కచ్చితంగా అనుమతులు తీసుకునే చెట్లను నరికివేస్తారని, అలాంటిది ప్రభుత్వ భూముల్లో ఉన్న జీవజాలంపైకి రాత్రికి రాత్రి బుల్డోజర్లతో వెళ్లాల్సినంత అత్యవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇచ్చిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యంగా ఉన్నదని సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం అక్కడ ఉన్న చెట్లను తొలగించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోకముందే భూమిని తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలను తెచ్చుకున్నదని అన్నారు. సీఎస్ ఇచ్చిన అఫిడవిట్ సమగ్రంగా లేదన్నారు. ఇప్పడు వేసవి కాలం వచ్చిందని అక్కడ ఉన్న వన్యప్రాణుల రక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. ఇక్కడ ఉన్న అడవిని కాపాడేందుకు ప్రయత్నించాలని విజ్ఙప్తి చేశారు. ఉన్న చెట్లను కొట్టేసి పర్యావరణ హితమైన ఐటీపార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నదని, ఇది సరైన పద్ధతి కాదన్నారు.