కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని ఈ నెల 3న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు శుక్రవారం స్టే విధించింది. నిర్మల్ జిల్లా సారంగపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ గతంలో ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఎన్నికల్లో తాను పోటీచేసేందుకు నామినేషన్ వేసినప్పటికీ, తన ప్రమేయం లేకుండానే ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరించారని, ఎన్నికల అధికారులు సైతం తన నామినేషన్ ఉపసంహరించినట్టు ప్రకటించారని అప్పట్లో పత్తిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈనెల 3న ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరిస్తూ రూ.50 వేల జరిమానా కూడా విధించింది. తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్సీ దండె విఠల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దండె విఠల్ ఎన్నికల చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.